About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the last she is my best friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That Disgusts...."

భవిష్యత్తులోకి తొంగిచూడొచ్చు!

భవిష్యత్తులోకి తొంగిచూడొచ్చు!
eenadu article.

ముందుకు వెళ్లి మళ్లీ వర్తమానంలోకి రావచ్చు
కాంతి వేగంతో ప్రయాణిస్తే సాధ్యమే
 ఈనాడుతో ప్రత్యేక ముఖాముఖిలో నోబెల్‌ గ్రహీత సెర్గె హరోచీ


అనుక్షణం తనతోతాను పోటీపడుతూ అసాధ్యమనుకుంటున్న చాలా అంశాలను సుసాధ్యం చేసుకుంటూ... విశ్వరహస్యాలను ఛేదిస్తున్న మానవుడు కాలాన్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకుంటాడా? కాలంలో వెనక్కూ ముందుకూ ప్రయాణించగలుగుతాడా? ఆసక్తికరమైన ఈ విషయాలకు సమాధానం చెప్పేదే క్వాంటమ్‌ భౌతికశాస్త్రం. ఐన్‌స్టీన్‌ వంటి శాస్త్రవేత్తకు కూడా కొరుకుడుపడని ఈ అంశం గుట్టుమట్లను విప్పి నోబెల్‌ బహుమతి సాధించారు ఫ్రాన్స్‌కు చెందిన విశ్వవిఖ్యాత భౌతికశాస్త్రవేత్త సెర్గె హరోచీ. తిరుపతిలో జరుగుతున్న భారత సైన్స్‌ కాంగ్రెస్‌ సదస్సుకు ప్రత్యేక అతిథిగా హాజరైన ఆయన అత్యంత క్లిష్టమైన కాంటమ్‌ భౌతికశాస్త్రం తీరుతెన్నులను, తాజా పరిశోధన పరిణామాలను, సాధ్యాసాధ్యాలను ఈనాడుతో ముఖాముఖిలో వివరించారు. ఆ ముఖ్యాంశాలు...
క్వాంటమ్‌ మెకానిక్స్‌ చాలా విచిత్రమైంది. చాలా సూక్ష్మ రేణువులు, వాటి బలాలను వర్ణించే ఈ శాస్త్రం విఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌కూ కొరుకుడుపడలేదు. అది అసంపూర్ణమైనదని, అది వాస్తవం కాకపోవచ్చని ఆయన 1935లో పేర్కొన్నారు. కాని ఇప్పుడు అది వాస్తవ రూపంలోకి వచ్చింది. దీన్ని మీరెలా విశ్లేషిస్తారు?
ఇది చాలా సుదీర్ఘ చరిత్ర. క్వాంటమ్‌ భౌతికశాస్త్రానికి చాలా విచిత్రమైన లక్షణాలు ఉన్నాయి. సూక్షస్థాయిలో పదార్థాలు విభిన్నంగా పనిచేస్తాయి. ఇందులో ముఖ్యమైన అంశం ‘క్వాంటమ్‌ ఎంటాంగిల్‌మెంట్‌’. రెండు క్వాంటమ్‌ వ్యవస్థలు పరస్పరం అనుసంధానమైనప్పుడు ఆ తర్వాత అవి పరస్పరం ఎంత దూరంగా జరిగినప్పటికీ వాటి మధ్య బంధం కొనసాగుతుంది. ఒక దానికి సంబంధించి మనం సేకరించే వివరాల వల్ల రెండోదాని నుంచి మనం పొందే ఫలితంపై కూడా ప్రభావం పడుతుంది. మనం ఒక వ్యవస్థను కొలుస్తున్నామంటే.. అందులో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పులు చేయకుండా దాని వివరాలు తీసుకోవడం సాధ్యం కాదు. ఈ మార్పులు తక్షణం చోటుచేసుకుంటాయి. దీన్ని క్వాంటమ్‌ భౌతికశాస్త్రంగా ఐన్‌స్టీన్‌ ఒప్పుకొన్నారు. కానీ పూర్తిస్థాయిలో కాదు. అయిష్టంగానే ఒప్పుకొన్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత మరో శాస్త్రవేత్త కొంత‌ ముందడుగు వేశారు. కొన్ని గణిత శాస్త్ర సమీకరణాలతో ఒక సూత్రాన్ని తెచ్చారు. క్వాంటమ్‌ మెకానిక్స్‌ నిజమే అయితే ఈ సమీకరణాలు ఉల్లంఘనలకు గురవుతాయి. నీల్స్‌ బోర్‌తో కూడా ఐన్‌స్టీన్‌ దీనిపై చర్చించారు. బోర్‌ కూడా దీనిపై పరిశోధనలు సాగించారు. ఆ తర్వాత అనేక ప్రయోగాలు జరిగాయి. ఈ సమీకరణాలు ఉల్లంఘనకు గురవుతాయని తేలింది. దీన్ని బట్టి ఈ ఎంటాంగిల్‌మెంట్‌ నిజమేనని స్పష్టమైంది. ఈ విచిత్ర వ్యవహారశైలిని ప్రకృతి ఆమోదిస్తుందని వెల్లడైంది. లేజర్లు వచ్చాకే ఈ ప్రయోగాలు సాధ్యమయ్యాయి. మళ్లీ ఈ లేజర్లు కూడా క్వాంటమ్‌ భౌతికశాస్త్రం నుంచి వచ్చినవే. ఇప్పుడు ఎంటాంగిల్‌మెంట్‌ను ఉపయోగించుకొని, రోజువారీ జీవితంలో అనేక ప్రయోజనాలను సాకారం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

క్వాంటమ్‌ రేణువులను ప్రత్యక్షంగా పరిశీలించడానికి ప్రయత్నిస్తే అవి నాశనమవుతాయన్న అభిప్రాయం ప్రబలంగా ఉన్న రోజుల్లో.. వాటిని నాశనం చేయకుండానే పరిశీలించొచ్చని మీరు ఎలా రుజువు చేయగలిగారు?
ఐన్‌స్టీన్‌, నీల్స్‌ బోర్‌, హైసన్‌బర్గ్‌ వంటి వారు క్వాంటమ్‌ భౌతికశాస్త్రంపై పనిచేస్తున్నప్పుడు.. అణువులు, కాంతిలోని రేణువులైన ఫోటాన్లలో మార్పులు చేయవచ్చని వారు భావించలేదు. సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఇలాంటి సాధ్యమవుతాయని వారు వూహించలేదు. కానీ ఈ రోజు పురోగతికి వారే కారకులు. క్వాంటమ్‌ భౌతికశాస్త్రం ఐన్‌స్టీన్‌కు రుచించకపోయినా.. ఆయనే దాన్ని కనుగొన్నారు. ఫలితాన్ని గౌరవించారు. ఇక్కడ మీకొక ఉదాహరణ చెబుతా. ఒక పోలీసు.. ఒక నేరగాడిని వెతుకుతున్నాడు. అయితే ఆ దొంగ తన కుటుంబ సభ్యుడేనని గుర్తించాడు. అతడు మంచి పోలీసు అయితే.. తన విధి తాను చేసుకుపోతాడు. ఐన్‌స్టీన్‌ కూడా అదే చేశారు. తాను గుర్తించింది తనకు రుచించలేదు. అది తన నమ్మకాలకు వ్యతిరేకంగా ఉన్నా అయిష్టంగానే అంగీకరించాడు.
లేజర్లు రావడం, కంప్యూటర్లు మరింత శక్తిమంతంగా తయారుకావడం, కుహరాల్లో ఫోటాన్లను సుదీర్ఘకాలం పాటు నిల్వ చేయగలిగే సామర్థ్యం రావడం వల్ల 1980ల నుంచి ఈ విషయంలో ప్రయోగాలు సాధ్యమయ్యాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానమంతా క్వాంటమ్‌ భౌతికశాస్త్రం ద్వారానే సాధ్యమైంది. వీటి ద్వారా పరమాణువులు, అయాన్లు, ఫోటాన్లు వంటి ఏక క్వాంటమ్‌ రేణువులో మార్పులు చేయడానికి వీలైంది. ముఖ్యంగా ఫోటాన్ల విషయానికొస్తే మనం వాటిని గుర్తిస్తే అవి నాశనమవుతాయి. డిటెక్టర్‌ వాటిని గ్రహించేస్తుంది. పరమాణువులు మాత్రం నాశనం కావు. వాటి స్థితిలో మార్పులు మాత్రమే జరుగుతాయి. ఫోటాన్లు నాశనం కాకుండానే వాటిని గుర్తించే విధానాన్ని మేం అభివృద్ధి చేశాం.
క్వాంటమ్‌ భౌతికశాస్త్రంలో ప్రధాన మైలురాయిగా నిలిచిపోయిన ఈ ఆవిష్కరణ చేసినప్పుడు మీ అనుభూతి ఏమిటి?
మా ప్రయోగం చాలా సుదీర్ఘకాలం నడిచింది. పైగా ఇది నా ఒక్కడి పరిశోధన కాదు. నా సహచరులు, తొలుత నా విద్యార్థులుగా ఉండి, తర్వాత నా పరిశోధన బృందంలో చేరినవారు.. అందరూ దీనికి తోడ్పడ్డారు. వారు లేకుంటే ఈ ఆవిష్కరణ సాధ్యమయ్యేది కాదు. ఈ వ్యవహారంలో పురోగతి చాలా మందగమనంలో సాగింది. కుహరాలను క్రమంగా మెరుగుపరచుకుంటూ మెల్లగా ముందుకు సాగాం. అతిపెద్ద విజయం పదేళ్ల కిందట వచ్చింది. ప్రస్తుత అద్భుత కుహరంలో ఫోటాన్లను బంధించడం, వాటిని నాశనం చేయకుండానే ఈ రేణువులను పరిశీలించగలగడం సాధ్యమైంది. చాలా సుదీర్ఘకాలం తర్వాత విజయం సాధించగలగడం మాకు పెద్ద వూరట అనిపించింది. మేం కలలు కన్న అనేక ప్రయోగాలను చేయడానికి ఈ ఆవిష్కరణ వీలు కల్పిస్తుందన్న ఆలోచన మమ్మల్ని ఉద్వేగానికి గురిచేసింది.
మీ పరిశోధనతో అత్యంత కచ్చితమైన గడియారాలను నిర్మించడానికి మార్గం సుగమమైంది. సమయానికి సంబంధించి అవి కొత్త ప్రమాణంగా కూడా భవిష్యత్‌లో మారే అవకాశం ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి. వాటి కచ్చితత్వం ప్రస్తుతమున్న సీసియం గడియారాల కన్నా వంద రెట్లు మెరుగ్గా ఉంటాయని చెబుతున్నారు. ఆ గడియారాలు ఎలా ఉంటాయి? వాటితో ప్రయోజనాలేంటి?
ఇది చాలా ఆసక్తికరమైన అంశం. కాని ప్రత్యక్షంగా దీనికి కారకుడు.. నా సహచరుడు పరమాణువులపై మరో సహచర శాస్త్రవేత్త సాగించిన పరిశోధనల వల్లే ఇది సాధ్యమైంది. ఆ గడియాయారాలు అటామిక్‌ అయాన్లలో ట్రాన్సిషన్‌పై ఆధారపడి పనిచేస్తున్నాయి. ఆయన ఆప్టికల్‌ ట్రాన్సిషన్ల ఆధారంగా కొత్త గడియారాలపై పనిచేస్తున్నారు. ఆప్టికల్‌ పౌనఃపున్యంలోని ట్రాన్సిషన్ల ఆధారంగా ఇవి పనిచేస్తాయి. ఈ పౌనఃపున్యం సెకనుకు 10-15 సైకిల్స్‌ మేర ఉంటుంది. ప్రస్తుతం ప్రామాణిక గడియారంగా ఉన్న సీసియం గడియారాలు.. సూక్ష్మ తరంగ ట్రాన్సిషన్‌పై ఆధారపడి పనిచేస్తున్నాయి. దాని పౌనఃపున్యం సెకనుకు 10 సైకిల్స్‌గా ఉంది. పాత పెండులం లేదా క్వార్జ్‌ గడియారాలు.. ఒక క్రమపద్ధతిలో సాగే ఒక పీరియాడిక్‌ విధానాన్ని లెక్కించడం ద్వారా పనిచేస్తాయి. అది సెకనుకు ఇక సైకిల్‌ మేర ఉంటుంది. అంటే పౌనఃపున్యం ఎంత ఎక్కువగా ఉంటే.. గడియారం కచ్చితత్వం అంత బాగా పెరుగుతుంది. అందువల్ల సీసియం నుంచి ఆప్టికల్‌ గడియారాల్లోకి వెళ్లినప్పుడు కచ్చితత్వం బాగా పెరుగుతుంది. ప్రాథమిక సైన్స్‌లో అనేక కీలక ఆవిష్కారాల వల్ల ఇది సాధ్యమైంది. విడి అయాన్లు కాకుండా లేజర్‌ కాంతితో శీతలీకరించిన పరమాణువుల సమూహంతో మరో రకం గడియారాల రూపకల్పనకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ తరహా గడియారాలు స్వల్పస్థాయి మార్పులకు కూడా చాలా బాగా స్పందిస్తాయి. ముఖ్యంగా గురుత్వాకర్షణలో వైరుద్ధ్యాలకు వీటి స్పందన బాగుంటుంది. భూమి మీద నుంచి కొన్ని సెంటీమీటర్ల మేర వీటిని ఎత్తులోకి తీసుకెళ్లినా.. గురుత్వాకర్షణ శక్తిలో తేడాలను పట్టేస్తాయి. ఫలితంగా వీటిని నేల సాంద్రతలో వైరుద్ధ్యాలను, సాపేక్ష సిద్ధాంతం వంటి వాటిని పరిశీలించడానికి ఉపయోగపడతాయి. భవిష్యత్‌లో వీటిని మరింత మెరుగుపరిస్తే ఆ గడియారాలు విశ్వం నుంచి వచ్చే గురుత్వాకర్షణ తరంగాలకు కూడా స్పందిస్తాయి. మీకు తెలిసే ఉంటుంది గత ఏడాది తొలిసారిగా ఈ తరంగాలను పసిగట్టడానికి అమెరికాలోని లిగో సాధనాన్ని ఉపయోగించారు. దాని ఏంటెన్నా అనేక కిలోమీటర్ల పొడవు ఉంది. కానీ మరింత మెరుగైన, సున్నితమైన గడియారాలు వస్తే చిన్నపాటి వ్యవస్థల సాయంతోనూ ఆ తరంగాలను పట్టుకోవచ్చు.
టైం మిషన్ల ద్వారా కాలంలో వెనక్కి వెళ్లడం సాధ్యమేనా?
కాలంలో వెనక్కి వెళ్లడం సాధ్యం కాదు. చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. అయితే సాపేక్ష సిద్ధాంతం ప్రకారం చాలా వేగంగా ప్రయాణిస్తే భవిష్యత్‌లోకి వెళ్లి, మళ్లీ వర్తమానంలోకి రావొచ్చు. అయితే ఇందుకు దాదాపు కాంతి వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇలా దాదాపు వందేళ్లు ముందుకెళ్లి.. ఏం జరుగుతుందో చూసి రావొచ్చు. భౌతికశాస్త్ర ప్రాథమిక సూత్రాలు దీనికేమీ అడ్డుపడటంలేదు. భూమి మీదున్న గడియారంతో పోలిస్తే మీ గడియారంలో వేగం నెమ్మదిస్తుంది. అయితే ఇందుకు సాంకేతికపరిజ్ఞానం పరంగా ఇబ్బందులు ఉన్నాయి. కాంతి వేగంతో ప్రయాణించే విధానం ఇంకా రాలేదు. పైగా గామా కిరణాలు వంటి వాటి వల్ల మరణానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంత వేగంగా ప్రయాణించడానికి భారీగా శక్తి అవసరం.
క్వాంటమ్‌ భౌతికశాస్త్రంపై చైనా ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతోంది. క్వాంటమ్‌ ఎంటాంగిల్‌మెంట్‌ అంశంలోనూ పురోగతి సాధించినట్లు చెబుతున్నారు. ప్రత్యేక క్వాంటమ్‌ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. వీటన్నింటినీ సైనిక అవసరాలకు ఉపయోగించాలన్నదే వారి ఉద్దేశమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనిపై మీ విశ్లేషణ ఏమిటి?
అది క్వాంటమ్‌ ఉపగ్రహం కాదు. చాలా ఎక్కువ దూరాల్లో క్వాంటమ్‌ ఎంటాంగిల్‌మెంట్‌ను అధ్యయనం చేయడం దాని ప్రధాన ఉద్దేశం. ఇందులో భాగంగా ఫోటాన్లను రెండు భిన్న దిశల్లోకి పంపి, అధ్యయనం సాగిస్తారు. ఇప్పటికే ఐరోపా శాస్త్రవేత్తలు ఈ తరహా ప్రయోగాలు చేశారు. ఫోటాన్లను ఆప్టికల్‌ ఫైబర్‌లపై అనేక కిలోమీటర్లపాటు పంపి, ఈ ఎంటాంగిల్‌మెంట్‌ను పరిశీలించారు. చైనా పరిశోధకులు సంకేతాలను ఉపగ్రహాలకు పంపి తిరిగి అందుకోవడం ద్వారా పరిశోధనలు సాగిస్తున్నారు. వారు ఏం చేస్తున్నారన్నది నాకు స్పష్టంగా తెలియదు. క్వాంటమ్‌ క్రిప్టోగ్రఫీపై పరిశోధనలు సాగిస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. ఎంటాంగిల్‌మెంట్‌ ద్వారా రహస్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం దీని ద్వారా సాధ్యమవుతుంది. రహస్యం అనగానే నిఘా, సైనిక అవసరాలకు బాగా అక్కరకొస్తుంది. ఈ తరహా పరిశోధనకు మద్దతు దక్కడానికి దురదృష్టవశాత్తు ఇదే కారణమవుతోంది. బ్యాంకింగ్‌ రంగంలో ఆర్థిక లావాదేవీల గోప్యతను కాపాడటం వంటి శాంతియుత అవసరాలకూ ఇది పనికొస్తుంది.
పొరుగునే ఉండటం వల్ల చైనా చర్యలు భారత్‌లో ఆందోళనకు కారణమవుతున్నాయి..
ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. క్వాంటమ్‌ భౌతికశాస్త్రాన్ని నేరుగా ఆయుధాల తయారీకి ఉపయోగించలేరు. ట్యాపింగ్‌కు వీలులేని సమాచార వ్యవస్థలను తయారుచేసుకోవడం వంటివి సాధ్యమవుతాయి. కానీ ప్రాథమిక స్థాయిలో క్వాంటమ్‌ ఎంటాంగిల్‌మెంట్‌ విషయంలో చేయాల్సింది ఎంతో ఉంది. ఇక్కడ మీకో విషయం చెప్పదలిచా.. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో మంచి పురోగతి సాధించాలంటే.. మీకు ప్రాథమిక సైన్స్‌ బలంగా ఉండాలి. చైనా శాస్త్రవేత్తలు క్వాంటమ్‌ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కానీ ప్రాథమిక సైన్స్‌ విషయంలో పెద్దగా విజయాలు వారి వద్ద లేవు. సైన్స్‌లో నోబెల్‌ సాధించడానికి ఎప్పుడూ తపన పడుతున్నారు. అది బాగానే ఉన్నా.. బలమైన ప్రాథమిక సైన్స్‌ అభివృద్ధి చెందడానికి అనువైన స్వేచ్ఛా వాతావరణం ఉండాలి. స్వేచ్ఛగా సృజనాత్మక ఆలోచనలు చేసే పరిస్థితులు ఉండాలి. చైనాలో పరిస్థితులు అందుకు అనువుగా ఉన్నాయని నేను అనుకోవడం లేదు. కానీ భారత్‌లో ప్రజాస్వామ్యం వల్ల అది ఉంది. కాని అదొక్కటే సరిపోదు. ఉదాహరణకు ఇక్కడ ‘భారత్‌లో తయారీ’ పెద్ద నినాదంగా మారింది. కానీ అది భారత్‌లో ఆవిష్కారం కాకుంటే అది భారత్‌లో తయారు కాదు. కాబట్టి ఆవిష్కారం నుంచి తయారీ వరకూ ఇదంతా ఒక గొలుసుకట్టు ప్రక్రియ. గొలుసులోని అన్ని బంధాలు.. బలంగా, అటుపోట్లకు నిలబడేలా ఉండాలి. బలమైన ప్రాథమిక శాస్త్రం కావాలంటే బాల్య దశలోనే మంచి విద్యా వ్యవస్థ ఉండాలి. వందకోట్లకుపైగా జనాభా కలిగిన భారత్‌లో మేధో సంపద పుష్కలంగా ఉంది. ప్రతిభావంతులు అనేక మంది ఉన్నారు. వారికి సరైన తర్ఫీదు ఇవ్వడం ముఖ్యం. అందువల్ల విద్యపై ప్రభుత్వాలు భారీగా పెట్టుబడులు పెట్టాలి. అయితే స్వల్పకాల ఫలితాలను ఇవ్వదు. కనీసం 20 ఏళ్ల తర్వాతే ఫలాలు అందుతాయి. దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు.. ముఖ్యంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అంత సుదీర్ఘకాలం గురించి ఆలోచించవు. ఎక్కువగా స్వల్పకాల అంశాలపై దృష్టిపెడతాయి.

ఒక వస్తువును భౌతికంగా రవాణా చేయకుండా కాంతి రూపంలోకి మార్చేసి.. క్షణంలో సుదూరాలకు చేరవేసే టెలిపోర్టేషన్‌ ప్రాజెక్టును రష్యా శాస్త్రవేత్తలు చేపట్టారు. ఈ పద్ధతిలో మానవులనూ రవాణా చేయవచ్చని వారు చెబుతున్నారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త మిచియో కాకు వంటి వారు కూడా దీనికి మద్దతు పలుకుతున్నారు. ఇది సాధ్యమేనా?
ఇది అర్థంపర్థంలేని అంశం. వారి వాదనతో విభేదిస్తున్నా. నిజానికి టెలిపోర్టేషన్‌ అనేది క్వాంటమ్‌ ఫ్యాక్స్‌ యంత్రం లాంటిది. ఒక ఫ్యాక్స్‌ యంత్రాన్ని మరోదానితో సంధానం చేసి, సమాచారం పంపడం లాంటిది. వాస్తవ ఫ్యాక్స్‌లో కాగితం బట్వాడా కాదు. కాగితం మీద రాసున్న సమాచారమే బట్వాడా అవుతుంది. క్వాంటమ్‌ టెలిపోర్టేషన్‌లో కూడా సమాచారమే బట్వాడా అవుతుంది. అది కూడా చిన్నపాటి వ్యవస్థలపై మాత్రమే సాధ్యమవుతుంది. భారీగా అనేక ఎంటాంగిల్డ్‌ రేణువులతో తయారైన పెద్ద వ్యవస్థల విషయంలో టెలిపోర్టేషన్‌ సాధ్యం కాదు. అది సైన్స్‌ కల్పన మాత్రమే. మానవ టెలిపోర్టేషన్‌ సాధ్యమనడానికి ఎలాంటి ప్రాతిపదిక లేదు. పైగా ఇది ప్రమాదకరం కూడా. ఫ్యాక్స్‌ విషయంలో మీకు నకలు ప్రతి వస్తుంది. అసలు ప్రతి అలాగే ఉంటుంది. క్వాంటమ్‌ సూత్రం ప్రకారం.. మీరు బట్వాడా చేయాలంటే అసలు ప్రతి నాశనమవుతుంది. అందువల్ల టెలిపోర్టేషన్‌లో ఏదైనా తేడా చోటుచేసుకుంటే చావు తప్పదు. ఇది నకలు ప్రతిని తయారుచేయడం కాదు.. వాస్తవ ప్రతిని నాశనం చేసి.. మరో ప్రతిని సృష్టించడం. క్వాంటమ్‌ క్లోనింగ్‌, కాపీయింగ్‌లు క్వాంటమ్‌ భౌతికశాస్త్రంలో నిషిద్ధం. సమాచారాన్ని టెలిపోర్ట్‌ చేస్తే క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో ఎంతో పురోగతి సాధ్యమవుతుంది.
క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌లో ఉన్న అవకాశాలేంటి. అది పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే ప్రపంచ స్థితిగతులు ఎలా మారబోతున్నాయి?
గోప్యంగా సమాచారాన్ని చేరవేయడానికి క్వాంటమ్‌ క్రిప్టోగ్రఫీ ఉపయోగపడుతుంది. ఎంతో దూరంగా ఉన్న క్వాంటమ్‌ కంప్యూటర్లు ఎంటాంగిల్‌మెంట్‌ బంధం ద్వారా ఉమ్మడిగా పనిచేయడం సాధ్యమవుతుంది. అవి ఎప్పటికల్లా సాధ్యమవుతాయో చెప్పడం కష్టం. వందేళ్ల తర్వాత సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉంటుందో చెప్పలేం. మధ్యలో అనేక పరిజ్ఞానాలు వస్తాయి. ఇతమిత్థమైన హామీలు ఇచ్చి, అవి సాకారం కాకుంటే ప్రజలకు సైన్స్‌పై నమ్మకం పోతుంది.
అత్యంత శక్తిమంతమైన క్వాంటమ్‌ కంప్యూటర్లలో పురోగతి ఎలా ఉండబోతోంది?
కంప్యూటర్లు శక్తిమంతం కావడానికి కారణం అందులో సమాచారాన్ని చేరవేసే బిట్‌ల పరిమాణం తగ్గిపోవడమే. ఇప్పుడు బిట్‌ల పరిమాణం నానో మీటర్ల స్థాయిలోకి చేరింది. ఆ తర్వాత పరమాణు స్థాయిలో వెళ్లిపోతాయి. అంతకు మించి ముందుకు వెళ్లడం సాధ్యం కాదు. అప్పుడు క్వాంటమ్‌ తర్కాన్ని ప్రయోగించడం, ఎంటాంగిల్‌మెంట్‌ను ఉపయోగించడం చేస్తేనే ఈ అడ్డంకిని అధిగమించడం సాధ్యమవుతుంది.
క్వాంటమ్‌ భౌతికశాస్త్రంపై పరిశోధనను మెరుగుపరచడానికి మీరిచ్చే సూచనలేంటి?
ఇందాక చెప్పినట్టు సాంకేతిక ఫలాలను పొందాలంటే ప్రాథమిక సైన్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు దీనికి ప్రాధాన్యం ఇస్తాయా అన్నదే ఇక్కడ ప్రశ్న. ప్రాథమిక సైన్స్‌ ఫలాలు పొందడానికి 40, 50 ఏళ్ల సమయం పడుతుంది. అంత ఎక్కువ కాలం తర్వాత వచ్చే ఫలితాలపై ప్రభుత్వాలు పెద్దగా ఆసక్తి చూపవు. వాతావరణ మార్పుల విషయంలోనూ ఇది జరిగింది. కానీ ఎట్టకేలకు పారిస్‌ ఒప్పందం ద్వారా ప్రభుత్వాలు కనీసం ఆరంభ చర్యలకైనా పూనుకున్నాయి. లేకుంటే పెను నష్టం జరిగేది. కాని అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నిక పెద్ద విఘాతం. ఆయన వాతావరణ మార్పుల అంశంపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ప్రత్యామ్నాయాలు చెప్పడం లేదు. అమెరికా వైదొలిగితే మిగతా దేశాలూ వెనకడుగు వేస్తాయి. అది మానవాళికి చాలా ఇబ్బందికరం.