"ఉక్కు నరాలు, ఇనుప కండరాలు వజ్రాయుధం లాంటి మనసున్న యువత మన దేశానికి కావాలి" అన్న వివేకానందుడి మాటలు నా బాల్యంలో చాలా గుండె ధైర్యాన్ని నింపాయి.
అదే ధైర్యం ఇంటర్మీడియెట్‌తో చదువు ఆగిపోయినా, చదవటం ఆపొద్దని నేర్పించింది.
అదే ధైర్యం తనను తాను తగ్గించుకోవడాన్ని నేర్పించింది.
అదే ధైర్యం నాలుగు గోడల మధ్య నుంచి బయటకు రాని ఒక కుర్రాడు బయటకు వచ్చి కొన్ని కోట్ల మందికి అభిమాన నటుడిని చేసింది.
అదే ధైర్యం 2014లో జనసేన పార్టీని పెట్టించింది.
అదే ధైర్యం ఎవరు ముఖ్యమంత్రి కావాలో చెప్పింది.
అదే ధైర్యం 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయనిచ్చింది.
అదే ధైర్యం 2019 ఎన్నికల్లో ఒక కానిస్టేబుల్ కొడుకుని ముఖ్యమంత్రిని చేస్తుంది.
గెలుపోటములు నాకు తెలియదు.. యుద్ధం చేయడం ఒక్కటే తెలుసు.
మానవత్వమే మన కులం
నాకు నిజంగా ముఖ్యమంత్రి పదవి మీద కోరిక లేదు. కానీ, ప్రజలకు న్యాయం జరగాలంటే ముఖ్యమంత్రి పదవి అనేది నాకొక బాధ్యత.
టీచర్ అవ్వాలంటే శిక్షణ తీసుకోవాలి, ఐఏఎస్ అవ్వాలంటే శిక్షణ తీసుకోవాలి. కానీ, డబ్బుంటే చాలు రాజకీయాల్లోకి వచ్చేయొచ్చనే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది.
ఈ నాలుగేళ్లలో నన్ను ఎన్నో సార్లు బెదిరించినా.. నీకు డబ్బుల్లేవు.. నీ వెంట అంతా కుర్రాళ్లు ఉన్నారు.. ఆఫ్టర్ ఆల్ ఓ కానిస్టేబుల్ కొడుకువి.. ముఖ్యమంత్రివి కాదు.. నీ దగ్గర వేల కోట్లు లేవు.. పేపర్లు లేవు.. ఛానెళ్లు లేవు.. నీ వెంట ఎవరొస్తారు? అన్నారు.
నాకు సూపర్ స్టార్డమ్ ఉండగానే రాజకీయాల్లోకి ఎందుకొచ్చానంటే.. ప్రస్తుత రాజకీయాల్లో చాలామంది నాయకులు యువత భవిష్యత్తును వారి భవిష్యత్తు కోసం వాడుకుంటున్నారు.
కానీ, నేను నా పాతికేళ్ల భవిష్యత్తును వదులుకుని, యువతకు 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వాలని వచ్చాను.
మానవత్వమే మన కులం, మతం. మానవత్వమే మనల్ని కలిపింది.
నా దగ్గరికి చాలామంది వచ్చారు. సినిమాలు వద్దు... చంద్రబాబుని అడిగి ఒక ఇన్ఫ్రా ప్రాజెక్టు తీసుకుని డబ్బులు సంపాదించుకోండని చాలామంది చెప్పారు. కానీ, నాకు అలాంటి దుష్టమైన పనులు పవన్ కల్యాణ్ చేయడు.
పల్లకీ మోయడానికి నన్ను వాడుకున్నారు
సమాజానికి ఇవ్వానికే రాజకీయాల్లోకి వచ్చాను కానీ, తీసుకోవడానికి కాదు.
2014లో ఏం ఆశించకుండా తెదేపా, భాజపాకు మద్దతు ఇచ్చాను.
అందరూ నన్ను పల్లకీలు మోయడానికి వాడుకున్నారు. అభివృద్ధి అనే పల్లకీలో ప్రజలను కూర్చోబెడతారని వాళ్ల పల్లకి మోశాను.
పవన్ బలం గోదావరి జిల్లాల్లోనే ఉంటుందని కొందరు అంటున్నారు. కానీ, శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు అంతా మాదే.
సీమలో నాకు బలం ఉందని విమర్శకులకు తొడగొట్టి చెప్పాలా? సీమ గొప్పతనాన్ని నేనూ చెప్పగలను. జనసేన బలం గోదావరి జిల్లాల్లోనే కాదని నిరూపించాను. నా పోరాట యాత్రలో అన్ని జిల్లాల్లో బలం చూపించాం.
తెలంగాణకు జనసేన అవసరం ఉంటుంది. తెలంగాణ ప్రజలకు కూడా ఒకరోజున జనసేన అండగా నిలబడుతుంది.
తెలుగు జాతి ఐక్యత కోసం జనసేన అవసరం కచ్చితంగా ఉంటుంది.
కులాల పేరుతో కుటుంబాలు బాగుపడుతున్నాయి. ప్రజలను కాపాడాల్సిన నాయకులే అవినీతికి పాల్పడుతుంటే ప్రజలు ఏమైపోవాలి? నాపై వ్యక్తిగత విమర్శలు చేసినా భరిస్తా. కానీ, ప్రజలను ఏమైనా అంటే ఊరుకోను.
జనసేన మేనిఫెస్టో
- జనసేన ప్రభుత్వం రాగానే రైతులకు సంవత్సరానికి ఎకరాకు రూ.8,000 సాయం చేస్తాం. అది రుణం కాదు, సహాయం. మిగులు బడ్జెట్ ఉంటే దాన్ని రూ.10,000కు పెంచుతాం.
- రైతు రక్షక భరోసా పథకం కింద 60 ఏళ్లకు పైబడిన సన్న చిన్నకారు రైతులకు నెలకు రూ.5,000 పింఛన్ ఇస్తాం.
- ప్రభుత్వ ప్రాజెక్టులకు, రహదారులకు భూములు కోల్పపోయిన రైతులకు 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం ఇస్తాం.
- ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.5000 కోట్లతో గ్లోబల్ మార్కెట్ ఏర్పాటు చేస్తాం.
- ప్రతి మండలంలో శీతల గిడ్డంగి ఏర్పాటు చేస్తాం.
- రైతుకు సోలార్ మోటార్లు అందిస్తాం.
- నదులను అనుసంధానించే ప్రాజెక్టులు చేపడతాం. కొత్త రిజర్వాయర్లు నిర్మిస్తాం.
- యువతకు దిశానిర్దేశం చేసేందుకు, ముఖ్యంగా విద్యార్థులకు ఉచిత విద్య పథకాన్ని ప్రవేశపెడతాం. కాలేజీకి వెళ్లేందుకు ఐడీ కార్డు చూపించి ఉచితంగా వెళ్లే సదుపాయం కల్పిస్తాం.
- ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేస్తాం. లక్షలాది మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ కార్యక్రమాలు చేపడతాం.
- అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే దాదాపు లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తాం.
- వివిధ రంగాల్లో సంవత్సరానికి 10 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం.
- ముస్లింల అభ్యున్నతి కోసం సచార్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తాం.
- ప్రభుత్వ ఉద్యోగాల పరీక్షలకు ఏడాదికి ఒకేసారి ఫీజు.
- ఎవరూ లంచం అడగని వ్యవస్థను తీసుకొస్తాం.
- డొక్కా సీతమ్మ క్యాంటీన్లలో ఉచిత భోజన వసతి కల్పిస్తాం.
- ప్రభుత్వోద్యోగుల కోసం సీపీఎస్ రద్దు చేస్తాం.
- బీసీలకు ఐదు శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తాం.
- ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తాం.
- దశలవారీగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 30 పడకల ఆస్పత్రులుగా అభివృద్ధి చేస్తాం.
- స్త్రీలకు అండగా ఉండే, భద్రత కల్పించేలా కఠిన చట్టాల రూపకల్పన చేస్తాం.
- మహిళలకు 33శాతం రిజర్వేషన్ల కల్పనకు కృషి చేస్తాం.
- డ్వాక్రా సంఘాల మహిళలకు స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇస్తాం.
- మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తాం.
- సంక్రాంతికి ఆడపడుచులకు చీరలు పంపిణీ చేస్తాం.
- ముస్లింలు, క్రైస్తవులు కోరుకుంటే ఏ పండుగైతే ఆ పండుగకు చీరల పంపిణీ
- ప్రతి మండలానికి కల్యాణ మండపం నిర్మాణం
- మహిళా ఉద్యోగుల కోసం శిశు సంరక్షణ కేంద్రాలు నిర్మాణం
- మహిళలకు పావలా వడ్డీకే రుణాలు
జనసేన మేనిఫెస్టో పట్ల ప్రముఖ రాజకీయ పరిశీలకుడు పెద్దాడ నవీన్ తన అభిప్రాయం బీబీసీతో పంచుకున్నారు.
"పవన్ కళ్యాణ్ మేనిఫెస్టో ప్రజల సమస్యలను లోతుగా పరిశీలించిన తర్వాత రూపొందించినట్టుగా కనిపిస్తోంది. గేమ్ ఛేంజర్ పాత్రలో పవన్ ఉంటారని తాజాగా ఆయన ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ప్రజల మౌలిక సమస్యలకు పరిష్కారాలను వెదికేందుకు ప్రయత్నించారు. ఉదాహరణకు రైతులకు ఎకరాకు ఎనిమిది వేల రూపాయలు సహకారం అందించడం చిన్న విషయం కాదు. దాని వల్ల రుణమాఫీ అవసరం ఉండదు. ఇక విద్యార్థులకు ఉచితంగా రవాణా, డొక్కా సీతమ్మ పేరుతో ఉచిత భోజన సదుపాయాం ఏర్పాటు చేయడం చాలా ఊరట కలిగించే విషయం. విద్యార్థులకు ఉచితంగా భోజనం ఏర్పాటు ప్రతీ ఇంట్లోనూ ఊరట కలిగించేది. ఇలాంటి పథకాల ద్వారా మిగిలిన పార్టీలు కూడా జనసేన నమూనా పాటించాల్సిన పరిస్థితి తీసుకొచ్చినట్టుగా కనిపిస్తోంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.