మన జీవితం నిత్యం ప్లాస్టిక్ తో ముడిపడిపోయింది. మనం ఉపయోగించే వస్తువుల్లో చాలా వరకు ప్లాస్టిక్ ఆక్రమించేసింది. ఆహారం నుంచి నీటి దాకా రకరకాల ప్లాస్టిక్ సీసాలు, డబ్బాల్లో పెట్టుకుని వినియోగించుకుంటున్నాం. అయితే అన్ని రకాల ప్లాస్టిక్ ఆహార నిల్వకు, వినియోగానికి పనికిరాదు. కొన్ని రకాల ప్లాస్టిక్ లో హానికరమైన రసాయనాలు ఉంటాయి. వాటిలో ఆహారం, నీళ్లు వంటివి పెట్టినప్పుడు ఆ విష రసాయనాలు ఆహారంలో కలసి.. ఆరోగ్య సమస్యలకు, కేన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు కారణమవుతాయి. అందుకే ప్లాస్టిక్ బాటిళ్లు, ప్యాకెట్లు, ఇతర పరికరాలపై అది ఏ తరహా ప్లాస్టిక్ అన్నదానిని గుర్తుల రూపంలో తెలియాలనే నిబంధన ఉంది. మరి ఏ తరహా ప్లాస్టిక్ హానికరం, వేటిని తిరిగి వినియోగించుకోవచ్చు అనేది తెలుసుకుందాం..
మూడు బాణాలు.. నంబర్లు..
ఏ తరహా ప్లాస్టిక్ అన్న విషయాన్ని తెలియజేసేందుకు, దానిని రీసైకిల్ చేసేందుకు వీలుగా ప్లాస్టిక్ వస్తువులపై ప్రత్యేకమైన చిహ్నం ఏర్పాటు చేస్తారు. ఒకదానివైపు మరొకటి వంగి త్రిభుజాకారంలో ఉన్న బాణాలతో కూడిన ఈ చిహ్నం మధ్యలో అది ఏ తరహా ప్లాస్టిక్ అన్నది నంబర్ తో తెలియజేస్తారు. అవేమిటో చూద్దాం..
- PETE (పాలీ ఇథైలీన్ టెరిప్తలేట్)
- HDPE (హై డెన్సిటీ పాలీ ఇథైలీన్)
- PVC (పాలీ వినైల్ క్లోరైడ్)
- LDPE (లో డెన్సిటీ పాలీ ఇథైలీన్)
- PP (పాలీ ప్రొపైలీన్)
- PS (పాలీ స్టైరీన్)
- Other (బీపీఏ, పాలీ కార్బోనేట్, లెక్సాన్ వంటి ఇతర ప్లాస్టిక్ రకాలు)
అయితే చాలా కంపెనీలు కేవలం బాటిళ్లు, డబ్బాల తయారీలో రంగులు, గట్టిదనం, డిజైన్ వంటి వాటి కోసం సంబంధిత ప్లాస్టిక్ తో పాటు వివిధ రకాల రసాయనాలను కలుపుతుంటాయి. కొన్నింటిలో అయితే ముడి పెట్రోలియం నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలను కూడా వినియోగిస్తుంటారు. ఆ వివరాలు మనకు అందుబాటులో ఉండవు. అందువల్ల మంచి, పేరున్న కంపెనీలు తయారు చేసినవి మినహా.. సాధారణ కంపెనీల ప్లాస్టిక్ లలో ప్రమాదకర రసాయనాలు ఉండే ప్రమాదం చాలా ఎక్కువ. సాధారణంగా చెప్పాలంటే 1, 3, 6 రకాలతో పాటు 7వ రకంలోని పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ లు ప్రమాదకరమైనవి. 2, 4, 5 రకం ప్లాస్టిక్ లు మాత్రం కొంత బెటర్. మరి ఏ తరహా ప్లాస్టిక్ ఏమిటి, వినియోగం, ప్రమాదాలేమిటి పరిశీలిద్దాం..
1. పాలీ ఇథైలీన్ టెరిప్తలేట్ (PET or PETE): జాగ్రత్త తప్పనిసరి
మనం నిత్యం అత్యంత ఎక్కువగా వినియోగించే ప్లాస్టిక్ రకం ఇది. దీనిని బాణాల త్రిభుజంలో 1 నంబర్ తో సూచిస్తారు. తాగునీటి బాటిళ్లు, కూల్ డ్రింకులు, జ్యూస్ బాటిళ్లు, పారదర్శకంగా ఉండే అన్ని రకాల బాటిళ్లు, ఆహారాన్ని తీసుకెళ్లగలిగేలా వినియోగించే డబ్బాలు వంటి వాటిల్లో ఈ తరహా ప్లాస్టిక్ ను వినియోగిస్తారు. తేలికగా ఉండడంతోపాటు దృఢంగా ఉండడం, సాధారణంగా లీకేజీలకు ఆస్కారం ఇవ్వకపోవడం, వంగగలిగే లక్షణం వల్ల ఈ ప్లాస్టిక్ వినియోగం చాలా ఎక్కువ. మనం కూల్ డ్రింక్ బాటిళ్లను పెట్ బాటిళ్లుగా వ్యవహరిస్తుంటాం. ఈ PET (పెట్) ప్లాస్టిక్ తో తయారవుతుంది కాబట్టే.. పెట్ బాటిళ్లుగా పేర్కొంటారు. ఈ తరహా ప్లాస్టిక్ కేవలం ఒకసారి వినియోగించడానికి మాత్రమే ఉద్దేశించినది. మళ్లీ మళ్లీ వాడడం ప్రమాదకరం.
- PET ప్లాస్టిక్ తయారీలో ఆంటిమొని ట్రయాక్సైడ్ ను, పలు ఇతర రసాయనాలను వినియోగిస్తారు. ఆంటిమొని మూలకం విషపూరితమైనది. ఇది మన ఆరోగ్యంపై హానికర ప్రభావం చూపుతుంది. కేన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
- సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఏ మాత్రం ఎక్కువ వేడిగా ఉన్నా.. PET ప్లాస్టిక్ లోని ఆంటిమొని కరిగి ఆహారం, నీళ్లలో కలుస్తుంది.
- ఎక్కువ కాలం ఆంటిమొని ప్రభావానికి లోనైతే శ్వాస, చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయని... మహిళల్లో అయితే గర్భస్రావం, రుతు సమస్యలు తలెత్తుతాయని పరిశోధకులు గుర్తించారు.
- PET ప్లాస్టిక్ నుంచి ఫ్తాలేట్ ఎండోక్రైన్ రసాయనాలు కూడా వెలువడతాయని, అవి ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతాయని కూడా నిర్ధారించారు.
2. హై డెన్సిటీ పాలీ ఇథైలీన్ (HDPE): కొంత వరకు భద్రమే
కాస్త దృఢంగా, కొంత వరకు వంగే గుణం కలిగిన రకం ప్లాస్టిక్ HDPE. దీనిని బాణాల త్రిభుజంలో 2 నంబర్తో సూచిస్తారు. నూనెల క్యాన్లు, షాంపూలు, డిటర్జెంట్లు వంటి వాటి బాటిళ్లు, ప్లాస్టిక్ బ్యాగులు, వాటర్ జగ్గులు, బకెట్లు, కుర్చీలు వంటి వాటిని తయారు చేయడానికి ఈ తరహా ప్లాస్టిక్ ను వినియోగిస్తారు. దీని తయారీ, రీసైకిల్ చేయడం సులభం కావడంతో.. విస్తృతంగా వినియోగంలో ఉంది. ఒక స్థాయి వరకు వేడిని తట్టుకోగలదు. అయితే ఈ తరహా ప్లాస్టిక్ పూర్తి పారదర్శకంగా ఉండదు.
- పెద్దగా హానికరం కాని ప్లాస్టిక్ రకాల్లో HDPE ఒకటి. ఆహార పదార్థాల నిల్వకు వినియోగించుకోవచ్చు. అయితే ఇది కాస్త మొరటుగా ఉండడం, ఒక స్థాయి దాటి ఒత్తిడి పడితే విరగడానికి అవకాశం ఉంది. దీనిని ఎక్కువగా రీ సైకిల్ చేస్తారు కాబట్టి ఆహార పదార్థాల ప్యాకేజింగ్ లో వినియోగించరు.
- HDPE ప్లాస్టిక్ లో నొనైల్ ఫినాల్ అనే రసాయనాన్ని వినియోగిస్తారు. ఈ ప్లాస్టిక్ నేరుగా ఎండకు, అతినీలలోహిత కిరణాల ప్రభావానికి గురైనప్పుడు నొనైల్ ఫినాల్ వెలువడుతుంది. ఇది మన శరీరంలో గ్రంథుల పనితీరుపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా స్త్రీలలో ఈస్ట్రోజెన్ హార్మోన్ సమస్యలకు దారి తీస్తుంది.
- చాలా వరకు మనం క్యారీ బ్యాగులుగా వినియోగించే కవర్లు.. HDPE తోనే తయారవుతుంటాయి. అవి చాలా పలుచగా ఉండడం వల్ల, వేడికి త్వరగా ప్రభావితం అవుతాయి. వాటిలో ఆహార పదార్థాలను ఉంచితే.. నొనైల్ ఫినాల్ రసాయనం కలిసే ప్రమాదం ఉంటుంది.
3. పాలీ వినైల్ క్లోరైడ్ (PVC or Vinyl): చాలా ప్రమాదకరం
చాలా ప్రమాదకరమైన ప్లాస్టిక్ లలో PVC ఒకటి. దీనిని బాణాల త్రిభుజంలో 3 నంబర్ తో సూచిస్తారు. ఈ ప్లాస్టిక్ వినియోగం దగ్గరి నుంచి రీసైక్లింగ్, డిస్పోజల్ వరకు అంతా విషపూరితమే. ఇది మెత్తగా, ఎక్కువగా వంగే లక్షణం గల ప్లాస్టిక్. ఉత్పత్తి ధర తక్కువగా ఉండడం, అవసరానికి తగినట్లుగా రూపొందించుకోగలగడం వల్ల ఈ తరహా ప్లాస్టిక్ వినియోగం ఎక్కువ. ఈ ప్లాస్టిక్ లో ప్రధానమైన సమ్మేళనం వినైల్ క్లోరైడ్. దీనికి అవసరాన్ని బట్టి మెత్తగా, పెళుసుగా, నున్నగా ఉండేందుకు ఎన్నో రకాల రసాయనాలను కలుపుతారు. ఈ రసాయనాలు చాలా ప్రమాదకరమైనవి. మెత్తని PVC ప్లాస్టిక్ ను ఆట బొమ్మలు, ప్యాకేజింగ్, ఏదైనా నొక్కి పదార్థాన్ని బయటికి తీసేందుకు వీలయ్యే బాటిళ్లు, మౌత్ వాష్, డిటర్జెంట్, షాంపూ బాటిళ్లు, వైర్లు, కేబుళ్ల ఇన్సులేషన్ గా వినియోగిస్తారు. ఇక గట్టి ప్లాస్టిక్ ను ఎలక్ట్రిక్ పరికరాలు, క్రెడిట్ కార్డులు, పైపులు, నిర్మాణ సామగ్రి తయారీలో ఉపయోగిస్తారు.
- ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ప్లాస్టిక్ లలో PVC రకం ప్లాస్టిక్ చాలా విషపూరితమైనది. ఇందులో బిస్ఫెనాల్ ఏ (BPA), ఫ్తాలేట్లు, సీసం, పాదరసం, కాడ్మియం, డయాక్సిన్ రకం రసాయనాలు దీనిలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించేవే కావడం గమనార్హం.
- ఈ ప్లాస్టిక్ లో ప్రధానమైన వినైల్ క్లోరైడ్ స్వయంగా ఒక కార్సినోజెన్ రసాయనం. అంటే కేన్సర్ కారక రసాయనంగా చెప్పొచ్చు.
- PVC ప్లాస్టిక్ లో మెత్తదనం కోసం కలిపే రసాయనాలు శరీరంలో హార్మోన్ల ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి. ఆస్తమాకు, అలర్జీలకు కారణమవుతాయి. మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్, పిల్లల్లో ఎదుగుదల మందగించడం వంటి సమస్యలు వస్తాయి.
4. లో డెన్సిటీ పాలీ ఇథైలీన్ (LDPE): చాలా వరకు మెరుగు
HDPE తరహాలోనే LDPE కూడా పెద్దగా ప్రమాదకరం కాని తరహాకు చెందిన ప్లాస్టిక్. దీనిని బాణాల త్రిభుజం మధ్యలో 4 నంబర్ తో చూపుతారు. సాంద్రత తక్కువగా ఉండేలా ఈ ప్లాస్టిక్ ను రూపొందిస్తారు. మెత్తగా ఉండడంతోపాటు వీలైనంతగా వంగే గుణం, సులువుగా తయారు చేసే అవకాశం, సులువుగా సీల్ వేసే వీలు వంటివి ఈ ప్లాస్టిక్ ప్రత్యేకతలు. సాధారణంగా అన్ని రకాల ప్లాస్టిక్ లతో పోలిస్తే.. సన్నగా, వీలైనంతగా వంచగలిగేలా ఈ తరహా ప్లాస్టిక్ ను తయారు చేయవచ్చు. ఆహార పదార్థాలను నిల్వ చేసుకునే డబ్బాలు, మూతలు, వేడి, చల్లని ద్రవ పదార్థాలను తాగేందుకు ఉపయోగించే కప్ లు, నొక్కి పదార్థాన్ని బయటికి తీయగలిగే బాటిళ్లు, ట్యూబ్లు, బ్యాగులు, ఆహారాన్ని, ఇతర పదార్థాలను చుట్టి ఉంచే రాప్స్ తయారీకి LDPE ప్లాస్టిక్ ను వినియోగిస్తారు.
- ఈ తరహా ప్లాస్టిక్ తో ప్రమాదం చాలా తక్కువే. కానీ బాగా వేడికి గురైనప్పుడు, అతినీల లోహిత (యూవీ) కిరణాల ప్రభావానికి లోనైనప్పుడు దీనిలోంచి నోనైల్ ఫినాల్ వంటి రసాయనాలు వెలువడతాయి.
- ఈ రసాయనాలు శరీరంలో హార్మోన్ల ఉత్పత్తిపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతాయి.
5. పాలీ ప్రొపైలీన్ (PP) ప్లాస్టిక్: దృఢం.. సురక్షితం
పెద్దగా ప్రమాదం ఉండని తరహా ప్లాస్టిక్ లలో పాలీ ప్రొపైలీన్ (PP) తరహా ప్లాస్టిక్ ఒకటి. దీనిని బాణాల త్రిభుజం మధ్యలో 5 నంబర్ తో సూచిస్తారు. దృఢంగా ఉండడంతోపాటు తేలికగా ఉండడం, ఎక్కువ వేడిని కూడా తట్టుకోగలగడం, వివిధ రకాల రసాయనాలను తట్టుకోగలిగిన శక్తి దీని ప్రత్యేకతలు. అందువల్ల వేడిగా ఉండే ఆహార పదార్థాలను ఉంచడానికి పాలీ ప్రొపైలీన్ తో తయారైన కంటెయినర్లు వినియోగిస్తుంటారు. మందుల కంటెయినర్లు, స్ట్రాలు, బాటిళ్ల మూతలు, పాల బాటిళ్లు, డిస్పోజబుల్ డైపర్లు, సానిటరీ ప్యాడ్ల లైనర్లు, వివిధ ఉపకరణాల్లో, కార్లలో ప్లాస్టిక్ భాగాలు వంటివి ఈ తరహా ప్లాస్టిక్ తో తయారవుతాయి.
- ఈ తరహా ప్లాస్టిక్ తో ప్రమాదం దాదాపుగా లేనట్లే. ఆహార పదార్థాలను, నీటిని నిల్వ చేసుకునేందుకు వినియోగించవచ్చు. అయితే కొన్ని కంపెనీలు ఈ PP ప్లాస్టిక్ ను స్థిరంగా ఉంచేందుకు ఓలియమైడ్ వంటి కొన్ని రకాల రసాయనాలను, ఇతర రకాల ప్లాస్టిక్ ను వినియోగిస్తుంటాయి. వాటి వల్ల హానికర సమస్యలు ఉండే అవకాశం ఉంది.
6. పాలీస్టైరీన్ (PS) ప్లాస్టిక్: చాలా ప్రమాదకరం
అత్యంత తేలికగా ఉండి తేలికైన అవసరాల కోసం వినియోగించే తరహా ప్లాస్టిక్ ఇది. దీనిని బాణాల త్రిభుజం మధ్య 6 నంబర్ తో సూచిస్తారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ప్లాస్టిక్. అతి తక్కువ ఖర్చుతోనే రూపొందించగలగడం, చాలా తక్కువ బరువు ఉండడం, తక్కువ సాంద్రతతో మెత్తగా ఉండడం వంటివి దీని లక్షణాలు. దీనిని ఒక రకంగా ఫోమ్ (నురగలా ఉండే) ప్లాస్టిక్ అని పిలవవచ్చు. స్టైరో ఫోమ్ ప్లేట్లు, కప్పులు, ఒకసారి వినియోగించి పడేసే చెంచాలు, ఫోర్కులు వంటి వస్తువులు, సీడీ, డీవీడీలు, హ్యాంగర్లు, హెల్మెట్లు, లైసెన్సు ప్లేట్లు, పలు రకాల ఔషధాల బాటిళ్లు, టెస్ట్ ట్యూబులు, ఫోమ్ ప్యాకేజింగ్, కోడిగుడ్లను ఉంచే ఫోమ్ ట్రేలు, వివిధ ఉపకరణాలకు రక్షణగా ప్యాకేజింగ్ లో వినియోగించేందుకు ఈ తరహా ప్లాస్టిక్ ను వినియోగిస్తారు. ఈ ప్లాస్టిక్ సులువుగా విరిగిపోతుంది.
- స్వతహాగా పాలీస్టైరీన్ లో ఉండే స్టైరీన్ కేన్సర్ కారకమైన రసాయనం. అది ప్రత్యుత్పత్తి వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. నాడీ మండలం, మెదడుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. కాలేయం, ఊపిరితిత్తులు, వ్యాధి నిరోధక వ్యవస్థ కూడా దెబ్బతింటాయని పరిశోధకులు గుర్తించారు.
- ఈ స్టైరీన్ రసాయనం సిగరెట్లు, కార్ల నుంచి వెలువడే పొగలోనూ ఉంటుందంటే దానితో ప్రమాదం ఎంతగా ఉంటుందో ఊహించుకోవచ్చు.
7. ఇతర ప్లాస్టిక్ రకాలు.. (BPA, Polycorbonate, Lexan & Other Plastics)
పాలీ కార్బొనేట్, లెక్సన్ సహా ఇతర రకాల ప్లాస్టిక్ లన్నింటినీ కలిపి ఈ కేటగిరీలో గుర్తించారు. వీటిని బాణాల త్రిభుజం మధ్యలో 7 నంబర్ తో గుర్తిస్తారు. ఈ గ్రూపు కింద వందల రకాల ప్లాస్టిక్ లు ఉంటాయి. అయితే వీటి వినియోగం తక్కువ. కొన్నిరకాలు పెద్దగా హానికరం కాకున్నా.. మరికొన్నింటిలో మాత్రం పలు హానికారక రసాయనాలు ఉంటాయి. చాలా వరకు తిరిగి వినియోగించుకునే వాటర్ బాటిళ్లు, ఇతర ఆహార నిల్వ బాక్సులు, నీటి కంటెయినర్లు, పళ్ల రసాలు, కెచప్ ల బాటిళ్లు, సీడీలు, బ్లూరే డిస్కులు, ఇళ్లలో వినియోగించే ఉపకరణాల్లో, కార్లలోని ప్లాస్టిక్ భాగాలు, కంప్యూటర్లు, పవర్ టూల్స్ లో, ఇతర చాలా రకాల అవసరాలకు 7వ కేటగిరీ ప్లాస్టిక్ లను వినియోగిస్తారు.
- 7వ కేటగిరీ ప్లాస్టిక్ లలో కొన్ని రకాలు హానికరం కాకున్నా... ఈ కేటగిరీ కింద కొన్ని వందల రకాల ప్లాస్టిక్ లు ఉన్నాయి. వాటిల్లో హానికర రసాయనాలు ఉండే అవకాశం ఉంది.
- ముఖ్యంగా BPA ఉండే పాలీకార్బొనేట్ ప్లాస్టిక్ తో ప్రమాదం ఉంటుంది. ఈ BPA మన శరీరంలో హర్మోన్ల విడుదలపై ప్రభావం చూపిస్తుందని పరిశోధకులు గుర్తించారు. దీనివల్ల పిల్లల్లో శారీరక, మానసిక పరమైన ఎదుగుదల లోపిస్తుందని వారు చెబుతున్నారు. పెద్ద వాళ్లలో పునరుత్పత్తి అవయవాలు, వ్యాధి నిరోధక వ్యవస్థ దెబ్బతింటాయని.. మధుమేహం, కేన్సర్ వంటివీ వస్తాయని హెచ్చరిస్తున్నారు.
- అయితే BPA రహిత ప్లాస్టిక్ అంటూ కొంత కాలంగా పలు కంపెనీలు ప్లాస్టిక్ బాటిళ్లు, కంటెయినర్లను విక్రయిస్తున్నాయి. వాటిని వినియోగించుకోవచ్చు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- ఏ తరహా ప్లాస్టిక్ అయినా సరే వేడికి గురైతే.. అది కరిగి ప్రమాదకర రసాయనాలు విడుదలవుతాయి. అందువల్ల వేడి వేడి ఆహారాన్ని నిల్వ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ డబ్బాలు, కవర్లు, ప్యాకెట్లను వినియోగించకపోవడం శ్రేయస్కరం.
- తిరిగి వినియోగించుకోగలిగే ప్లాస్టిక్ బాటిళ్లు, డబ్బాలు అయినా కూడా.. తరచూ బాగా శుభ్రం చేయాల్సిందే. లేకుంటే బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి పెరిగి రోగాలకు కారణమవుతాయి.
- పునర్వినియోగించగల ప్లాస్టిక్ బాటిళ్లు, వస్తువులను వెనిగర్ తోగానీ, యాంటీ బ్యాక్టీరియల్ మౌత్ వాష్ తోగానీ శుభ్రం చేయడం మంచిది.
- సాధారణ పెట్ బాటిళ్లను కేవలం ఒకసారి మాత్రమే వినియోగించాలి. అంతకు మించితే.. ప్లాస్టిక్ లోని రసాయనాలు నీటిలో కలసి ఆరోగ్యానికి హానికరంగా పరిణమిస్తాయి.
- కేటగిరీ 7లో ఉండే ప్లాస్టిక్ బాటిళ్లు, బాక్సులను ఆహార వినియోగం కోసం ఉపయోగించవద్దు. దానివల్ల BPA రసాయనం బారినపడే ప్రమాదముంది.