About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

వ్యాయామంతో తెల్లరక్త కణాలకు చురుకుదనం

Eenadu article on 06-05-2020
రోగ నిరోధక శక్తే బ్రహ్మాస్త్రం
‘ఒమేగా-3’ ఉండే ఆహారం కీలకం
వ్యాయామంతో తెల్లరక్త కణాలకు చురుకుదనం
పసుపు, నువ్వుల నూనె, అవిసె గింజలతోనూ ప్రయోజనం
అమెరికాకు చెందిన  శాస్త్రవేత్త డాక్టర్‌ మద్దిపాటి కృష్ణారావుతో ‘ఈనాడు’ ఇంటర్వ్యూ

కంటికి కనిపించని శత్రువు...
ఎటు నుంచి ప్రమాదం పొంచి ఉందో తెలియదు...
ఈ పరిస్థితుల్లో సర్వశక్తులూ ఒడ్డి మనల్ని మనం రక్షించుకోవాలి. ముఖ్యంగా కరోనాను మన శరీరం తట్టుకోగలుగుతుందా?... ఒకవేళ వైరస్‌ సోకితే దాన్ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటున్నామా... అని ఆలోచించుకోవాలి. వ్యాధి నిరోధకశక్తి పెరిగేందుకు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి... అంటున్నారు అమెరికాలోని డెట్రాయిట్‌కి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త  డాక్టర్‌ మద్దిపాటి కృష్ణారావు. వేన్‌ స్టేట్‌ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా, లిపిడోమిక్‌ కోర్‌ ఫెసిలిటీ డైరెక్టర్‌గా ఆయన పని చేస్తున్నారు. ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచేందుకు, తగ్గించేందుకు ఉపయోగపడే కొవ్వు పదార్థాలేమిటనే అంశంపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. మనుషుల్లో అత్యధిక శాతం రోగాలు... ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గకపోవడం వల్లే వస్తాయని, కరోనా వైరస్‌ సోకిన వారిలో 5-10 శాతం మంది చనిపోవడానికీ అదే కారణమని తెలిపారు. అసలు ఇన్‌ఫ్లమేషన్‌ అంటే ఏమిటి? దానికీ కరోనాకూ సంబంధమేమిటి? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్‌ఫ్లమేషన్‌ను నియంత్రించడంలో కొవ్వులు ఎలాంటి పాత్ర పోషిస్తాయి?.. తదితరాలపై ఫోన్‌లో కృష్ణారావు ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన చెప్పిన విషయాల్లోని ముఖ్యాంశాలు..



మరమ్మతు ప్రక్రియ
శరీరానికి భౌతికంగా దెబ్బ తగిలితే ఆ చోటులోని మృత కణాల్ని తొలగించేందుకు, శరీరంలోకి రోగకారక బ్యాక్టీరియా, వైరస్‌ వంటి సూక్ష్మ క్రిములు(పాథోజెన్స్‌) ప్రవేశించినప్పుడు... వాటిని బయటకు పంపేందుకు తెల్లరక్త కణాలు ప్రయత్నిస్తాయి. ఆ రెండు సందర్భాల్లోనూ శరీరంలో జరిగే ప్రక్రియనే ‘ఇన్‌ఫ్లమేషన్‌’ అంటారు. ఇది శరీరంలో దెబ్బతిన్న భాగాన్ని మరమ్మతు చేసే ప్రక్రియ. దీనిని శత్రువులా చూడకూడదు. అది జరగకపోతే... శరీరానికి స్పందించే గుణం ఉండదు. వాపు, నొప్పి, ఎర్రబడటం, జ్వరం అనే నాలుగు లక్షణాలతో ఇన్‌ఫ్లమేషన్‌ను గుర్తించొచ్చు.

హానికారకాల పని పట్టేందుకు..

శరీరంలోకి హానికారక వైరస్‌లు, బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిములు ప్రవేశించినప్పుడు... వెంటనే తెల్లరక్త కణాలు రంగంలోకి దిగి వాటి పనిపడతాయి. ఎర్రరక్త కణాలు ఒక రకమే. తెల్ల రక్తకణాలు మాత్రం చాలా రకాలు. ఒక్కో రకం ఒక్కో విధిని నిర్వహిస్తాయి. తెల్లరక్త కణాల్లో కొన్ని వైరస్‌ల్ని పట్టుకుని తీసుకెళ్లేవి, కొన్ని వాటిని హరించేవి, కొన్ని విసర్జించేవి, దెబ్బతిన్న అవయవంలోనే నిర్దిష్టంగా పని చేసేవీ... ఇలా వేర్వేరుగా ఉంటాయి. ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ... ఇలా వేర్వేరు చోట్ల, వేర్వేరు తెల్లరక్త కణాలు పని చేస్తాయి.

బ్లీచింగ్‌ కంటే ఘాటు...
శరీరంలోకి హానికారక సూక్ష్మక్రిములు ప్రవేశించినప్పుడు వాటిని నాశనం చేసే క్రమంలో చాలా పెద్ద ప్రక్రియ జరుగుతుంది. మొదట ఒమేగా-6 ఫ్యాటీయాసిడ్స్‌ పని మొదలు పెట్టి... ప్రోస్టాగ్లాండిన్స్‌, ల్యూకోట్రైయీన్స్‌ అనే కాంపౌండ్స్‌ను విడుదల చేస్తాయి. అవి తెల్ల రక్తకణాల్ని ఆకర్షిస్తాయి. వెంటనే ఒక రకం తెల్ల రక్తకణాలు రంగంలోకి దిగుతాయి. అవి ఇతర తెల్ల రక్తకణాల్ని ఆకర్షించేందుకు ‘సైటోకైన్స్‌’ అనే ప్రొటీన్‌ మాలిక్యూల్స్‌ను విడుదల చేస్తాయి. సైటోకైన్స్‌లోనూ పలు రకాలుంటాయి. సమస్య ఏ అవయవంలో ఉందో, అక్కడ పని చేసే తెల్లరక్త కణాల్ని ఆకర్షించేలా సైటోకైన్స్‌ విడుదలవుతాయి. తెల్ల రక్తకణాలు వచ్చి సూక్ష్మక్రిముల్ని తమలోకి లాగేసుకుని ముక్కలు ముక్కలు చేసేస్తాయి. వాటిని హరించుకుని, బయటకు విసర్జించే ప్రక్రియలో భాగంగా చాలా శక్తిమంతమైన, ఘాటైన రసాయనాల్ని విడుదల చేస్తాయి. అవి మనం ఇళ్లల్లో వాడే సాధారణ బ్లీచింగ్‌ పౌడర్‌ కంటే ఘాటుగా ఉంటాయి. ఆ రసాయనాల వల్ల సాధారణ కణాలకూ నష్టం జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియను ఇన్‌ఫ్లమేషన్‌ అంటారు.

ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించే కారకాలు

హానికారక సూక్ష్మక్రిముల్ని నాశనం చేసే క్రమంలో ఇన్‌ఫ్లమేషన్‌ ఒక స్థాయికి చేరుకుంటుంది. సమస్య తొలగిందని భావించాక... ఇన్‌ఫ్లమేషన్‌కి కారణమైన తెల్ల రక్త కణాలు నెమ్మదిగా తమ స్వభావాన్ని మార్చుకుంటాయి. దీనికి ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్‌ దోహదం చేస్తాయి. వాటి నుంచి వచ్చే కొన్ని రకాల కాంపొనెంట్స్‌ ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. ఈ ప్రక్రియను ‘ఇన్‌ఫ్లమేషన్‌ రిజల్యూషన్‌’ లేదా ‘ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌’ రిజల్యూషన్‌ అంటారు. కొందరిలో ఒమేగా-3 కొవ్వులు తగినంత లేకపోయినా, ఒకవేళ ఆ కొవ్వులు ఉన్నప్పటికీ వాటి నుంచి ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించే కాంపొనెంట్స్‌ తయారవడంలో సమస్య ఉన్నా.... ఇన్‌ఫ్లమేషన్‌ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అది అనేక అనర్థాలకు దారితీస్తుంది.

ఉప్పెనలా సైటోకైన్స్‌

ఇన్‌ఫ్లమేషన్‌ మితిమీరి పెరిగిపోవడం వల్ల చాలా నష్టాలుంటాయి. గుండె జబ్బులు, క్యాన్సర్లు, తీవ్రమైన కీళ్ల నొప్పులు(ఆర్థరైటిస్‌) వంటివి ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గకపోవడం వల్ల సంభవించేవే. వాటినే క్రానిక్‌ ఇన్‌ఫ్లమేటరీ డిసీజెస్‌ అంటారు. ప్రతి 100 మంది క్యాన్సర్‌ రోగుల్లో ఐదుగురికే జన్యుపరంగా ఆ వ్యాధి వస్తుంటే.. మిగతా 95 మందిలో ఏదో రకంగా కలిగిన ఇన్‌ఫ్లమేషన్‌ వల్లే సంభవిస్తోంది. కొవిడ్‌ రోగుల విషయానికి వస్తే... తెల్ల రక్తకణాలు కరోనా వైరస్‌ను చంపే క్రమంలో 90-95 శాతం మందిలో రోగ నిరోధక శక్తి అభివృద్ధి చెందుతోంది. 5-10 శాతం మందిలో ఇన్‌ఫ్లమేషన్‌ ప్రక్రియ ఆగడం లేదు. వారిలో ఇన్‌ఫ్లమేషన్‌ను పెంచేందుకు దోహదం చేసే సైటోకైన్స్‌ ఒక ఉప్పెనలా విడుదలవుతున్నాయి. దాన్నే ‘సైటోకైన్‌ స్టార్మ్‌’ అంటారు.

నీటిలో పెరిగే మొక్కల్లో...

ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్‌ అన్ని అవయవాల్లోనూ ఎంతో కొంత ఉన్నా... మెదడులో అతి ఎక్కువ. వాటిని తయారుచేసే సామర్థ్యం మనిషి శరీరానికి చాలా తక్కువ. తల్లి పాలలో సమృద్ధిగా ఉంటాయి. చేపల్ని తినడం ద్వారా, చేప నూనెతో చేసిన క్యాప్స్యూల్స్‌ వేసుకోవడం ద్వారా ఒమేగా-3 కొవ్వులు పొందొచ్చు.

ఇలా చేయండి..
* ప్రతిరోజూ చేప నూనెతో  తయారైన క్యాప్స్యూల్‌ ఒకటి,  మల్టీ విటమిన్‌ కాప్య్సూల్‌ ఒకటి ప్రతిరోజూ వేసుకోవాలి.
* పసుపులో ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించే గుణం ఉంది. అలాగని శ్రుతిమించి తిన్నా ప్రమాదమే. అవిసె గింజల్లోనూ ఒమేగా-3 కొవ్వులు ఉంటాయి.
* శరీరానికి చెమట పట్టేలా రోజూ 20-30 నిమిషాల పాటు ఏదో ఒక వ్యాయామం చేయాలి.
* ఆవిరి పట్టడం వల్ల శ్వాస నాళాలు తెరుచుకుంటాయి. ఊపిరితిత్తులకు ఆక్సిజన్‌ బాగా అందుతుంది. తెల్లరక్త కణాలు చురుగ్గా పనిచేయడానికి ఆక్సిజన్‌ అత్యవసరం.

* జ్వరం వస్తే పారాసిటమాల్‌ వేసుకోవాలి. ‘నాన్‌ స్టెరాయిడల్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్‌’ వాడటం ఏమాత్రమూ మంచిది కాదు. ఆస్ప్రిన్‌ వంటివి వైద్యులు చెబితేనే తీసుకోవాలి.

ఏమిటీ శక్తి..?
మానవ శరీరంలో ప్రవేశించిన వైరస్‌లను లింపోసైట్స్‌ అనే రకం తెల్ల రక్త కణాలు జీర్ణం చేస్తాయి. అదే వైరస్‌ మళ్లీ మన శరీరంలో ప్రవేశిస్తే వెంటనే గుర్తిస్తాయి. వాటివల్ల హాని కలగకుండా యాంటీబాడీలు అనే ప్రొటీన్లను తయారు చేస్తాయి. ఒకసారి ఎదుర్కొన్న వైరస్‌ మళ్లీ రెండోసారి శరీరంలో ప్రవేశించగానే, యాంటీబాడీలు పసిగట్టి వెంటనే చుట్టుముడతాయి. జీర్ణంచేసే తెల్ల రక్త కణాలకు వైరస్‌లను అప్పగిస్తాయి. అందుకే ఒకసారి సోకిన వైరస్‌ మళ్లీ వచ్చినా మనిషికి ఎలాంటి ఇబ్బందీ రాదు. దీన్నే రోగనిరోధక శక్తి అంటారు.

టీకాలు వేసేది అందుకే...
టీకాలు(వ్యాక్సిన్‌)  వేసేది... వైరస్‌ నిరోధక శక్తిని పెంచేందుకే. రోగ కారక వైరస్‌ను అచేతనం చేసి టీకా ద్వారా రక్తంలోకి ఎక్కిస్తారు. ఆ వైరస్‌ మనకు రోగం కలిగించలేదు. అయినప్పటికీ మన శరీరంలోని తెల్ల రక్త కణాలు దాన్ని గుర్తించి వెంటనే యాంటీబాడీలను తయారు చేసేస్తాయి. అలా రోగ నిరోధక శక్తి వచ్చేస్తుందన్నమాట. ఒకరిలో తయారైన యాంటీబాడీలను... అదే వైరస్‌ సోకిన ఇంకొకరి రక్తంలోకి ఎక్కించి వారి శరీరంలోని వైరస్‌నూ నిరోధించవచ్చు. దీనివల్ల రెండో వ్యక్తికి ఆ వైరస్‌ నుంచి తాత్కాలిక రక్షణేగాని శాశ్వత నిరోధక శక్తి కలగదు. ఒక వైరస్‌ను గుర్తించడానికి ఒక యాంటీబాడీ సరిపోతుంది. అయినా ఒకే వైరస్‌ కోసం పలు రకాల యాంటీబాడీలను తయారు చేసే కణాలను మన శరీరం ఉత్పత్తి పెట్టుకుంటుంది. ఇవి ఇంచుమించు జీవితాంతం శరీరంలో ఉంటాయి.

యాంటీ బయోటిక్స్‌ పని చేయవు

* కరోనా వైరస్‌కు మందుల్లేవు. వైరస్‌లను యాంటీబయోటిక్స్‌ ఏమీ చేయలేవు. కరోనా సోకినవారి శరీరం బలహీనపడి ఇతర బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లు పెరగకుండా ఉండేందుకే యాంటీబయోటిక్స్‌ వేసుకోమని చెబుతున్నారు. చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, భౌతికదూరం పాటించడం, రోగనిరోధక శక్తి పెరిగేందుకు దోహదపడే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ గల ఆహారం తీసుకోవడం వంటి చర్యల ద్వారానే కరోనాను తట్టుకోగల సామర్థ్యం పెంచుకోగలం.
* కరోనా వైరస్‌లో జన్యు మార్పు వేగంగా సాగుతోంది. అది జీవించి ఉన్న కణం కాదు. ఏదైనా జీవించి ఉన్న కణంలో ప్రవేశించినప్పుడే కరోనావైరస్‌కు జీవం వస్తుంది. అలాంటి వైరస్‌ల్ని అడ్డుకునే శక్తి మనిషి చర్మానికి ఉంది. కానీ వైరస్‌... నోరు, ముక్కు, చెవి, కళ్లలోకి వెళ్లినప్పుడు నేరుగా రక్తంలోకి కలుస్తుంది.
* కరోనా వైరస్‌ నేరుగా మనిషి జీర్ణ వ్యవస్థలోకి వెళితే ఎలాంటి నష్టమూ కలగదు. నోట్లోకి వెళ్లాక రక్తంలోకి ప్రవేశించకుండా నేరుగా జీర్ణవ్యవస్థలోకి వెళ్లే అవకాశం లేదు. వైరస్‌ రక్తంలో ప్రవేశించినప్పుడే ఇన్‌ఫ్లమేషన్‌ పెరుగుతుంది.

* ఒకసారి వైరస్‌ సోకాక శరీరంలో యాంటీబాడీలు తయారవుతాయి. ఆ తర్వాత ఎప్పుడు ఆ వైరస్‌ సోకినా.... దాడి చేసేందుకు అవి సిద్ధంగా ఉంటాయి.

కామెంట్‌లు లేవు: