I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."
విదుర నీతి: నిద్ర పట్టని వాళ్లు ఎవరు? Vidur Niti
విదుర నీతి: నిద్ర పట్టని వాళ్లు ఎవరు?
జీవితం ప్రశాంతంగా గడపాలని ప్రతి వ్యక్తీ కోరుకుంటాడు. సమాజంలో శాంతి ఉన్నప్పుడే ప్రజలు సుఖంగా ఉంటారు. ఇందుకు నీతినియమాలు తోడ్పడతాయి. నీతి తప్పిన సమాజంలో అశాంతి నెలకొంటుంది. మన సాహిత్యం లోక క్షేమాన్ని కోరుకొంటుంది. భారతీయ ధర్మశాస్త్రాలు మానవుడు ఎలా జీవిస్తే సమాజానికి మేలు జరుగుతుందో చెబుతాయి. ఈ గ్రంథాలను రచించినవారు మహర్షులే! యుగధర్మాలను బట్టి ఈ ధర్మశాస్త్రాలు విభిన్న మార్గాలను మనకు సూచిస్తాయి. కృతయుగంలో మనుధర్మ శాస్త్రం, త్రేతాయుగంలో గౌతమస్మృతి, ద్వాపరంలో శంఖలిఖితుల స్మృతి- ప్రామాణికాలు. కలియుగంలో పారాశర్య స్మృతిని పాటించాలని రుషులు భావించారు. మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని నీతుల గురించి అభిప్రాయాలూ మారుతున్నాయి. కొన్ని మాత్రం యుగాలు మారినా మారవు.
ఎప్పటికీ సమాజానికి ఉపయోగపడే నీతులు చెప్పినవారిలో విదురుడు ముఖ్యుడు. ఒక దాసికి, వ్యాసుడికి జన్మించిన విదురుడు ధృతరాష్ట్రుడికి తోడుగా ఉంటూ హితోక్తులు చెబుతూ, పాండవుల మేలు కోరుతూ ఉండే కృష్ణభక్తుడు.
రాయబారానికి శ్రీకృష్ణుడు వెళ్ళినప్పుడు ఎవరి ఇంట్లోనూ భోజనానికి అంగీకరించడు. విదురుడి ఆహ్వానాన్ని మన్నించి అతడి ఇంటికి మాత్రం వెళ్ళాడు. విదురుడు భక్తితో స్వయంగా తానే కృష్ణుడికి ఆహారం తినిపించాడు. భక్తి పారవశ్యంతో ఒడలు మరచి, అరటిపండు తొక్క ఒలిచి దాన్నే కృష్ణుడి నోటికి అందించి, లోపలి పదార్థాన్ని పారవేశాడు! విదురుడి నిర్మల భక్తికి ఇది నిదర్శనం.
సంజయుడు పాండవుల వద్దకు రాయబారానికి వెళ్ళివచ్చిన తరవాత, ధృతరాష్ట్రుడివి అన్నీ అధర్మ కృత్యాలేనని అధిక్షేపించాడు. అప్పటి నుంచి మానసిక క్షోభతో ధృతరాష్ట్రుడికి నిద్రపట్టలేదు. విదురుణ్ని పిలిచి మంచి మాటలతో తన మనసుకు ప్రశాంతత కలగజేయమన్నాడు. విదురుడు ముందుగా నిద్ర పట్టనివాళ్లెవరో చెబుతాడు. ‘బలవంతుడితో విరోధం పెట్టుకున్న వాడికి, సంపద పోగొట్టుకున్న వాడికి, కాముకుడికి, దొంగకు నిద్ర ఉండదు’ అని అంటాడు. విదురుడి నీతులకు ఏ యుగంలోనైనా విలువ అలాగే చెక్కుచెదరకుండా ఉంటుంది!
జ్ఞానులు ఎలా ప్రవర్తిస్తారో, మూర్ఖులు ఎలా ఉంటారో విదుర నీతులనుబట్టి చక్కగా తెలుసుకోవచ్చు. తనకు అందనిదాన్ని గురించి ఆరాటపడనివాడు, పోయినదాన్ని గురించి విచారించనివాడు, ఆపదలో సైతం వివేకం కోల్పోనివాడే జ్ఞాని. అధికమైన సంపద, విద్య ఉన్నప్పటికీ ఉత్తముడు వినయంగానే ఉంటాడు.
మూర్ఖుడు వెంటనే చేయవలసిన పనిని అడుగడుగునా అనుమానిస్తూ, ఆలస్యంగా చేస్తాడు. అతడు తాను తప్పుచేసి, ఎదుటివాణ్ని నిందిస్తాడు. ధనం లేకుండా కోరికలు పెంచుకోవడం, సమర్థత లేకపోయినా ఇతరులపై మండిపడటమనే ఈ రెండూ మనిషిని కృశింపజేస్తాయి.
‘మధుర పదార్థం నలుగురికీ పంచకుండా ఒక్కడే భుజించకూడదు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక్కడే కూర్చుని బయటపడే ఉపాయం ఆలోచించకూడదు... అందరూ నిద్రపోతుంటే ఒక్కడే మెలకువతో ఉండకూడదు. మానవుడికి ఆరు సుఖాలున్నాయి. అవి ఆరోగ్యం, ధన సంపాదన, ప్రియురాలైన భార్య, చెప్పినట్లు వినే పుత్రుడు, సంపాదనకు పనికివచ్చే విద్య!’ అని విదురుడు విశదీకరించాడు.సమాజానికి ఎప్పటికీ పనికొచ్చే విధంగా ఉపదేశించిన విదురనీతులు అజరామరాలు. అందుకే భారతానికి ‘ధర్మశాస్త్రం’ అనే పేరు వచ్చింది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి