About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

మల్లి మస్తాన్బాబు , కెప్టైన్ పవన్ కుమార్ , లాన్స్ నాయక హనుమంతప్ప

జెండా ఎగరేశాక.. కన్నీరాగలేదు!
ఓ చనిపోయిన వ్యక్తి చివరి కోరికేమిటో చెప్పగలమా? వూపిరితిత్తుల నుంచి తుట్టతుది గాలి వీడ్కోలు తీసుకునేటప్పుడు అతను పడ్డ తపన ఎందుకోసమో ­వూహించగలమా?మనసూ.. మమతతో జీవితాన్ని చూసే స్త్రీలకి అది అసాధ్యం కాదు! డాక్టర్‌ మల్లి దొరసానమ్మ అలా వూహించగలిగారు.తమ్ముడి నెరవేరని ఆశయాన్ని తాను పూర్తిచేయడానికి నడుంబిగించారు.అదీ దాదాపు అరవైఏళ్ల వయసులో! ప్రపంచంలో అతిపొడవైన ఆండీస్‌ పర్వతాలను అధిరోహించి!! అక్కడ మన జాతీయజెండాని రెపరెపలాడించి!! పర్వతారోహణ క్రమంలోనే ప్రాణాలు కోల్పోయిన మల్లి మస్తాన్‌బాబు స్వప్నాన్ని అక్కగా తాను నెరవేర్చిన ఆ ప్రయాణాన్ని ఆమె వసుంధరతో పంచుకున్నారిలా..
ముందుగా ఓ విషయం చెప్పేస్తాను..! నాకీ పర్వతారోహణల గురించి ఏమీ తెలియదు. ఆసక్తి ఉన్నా.. అంతకు పది రెట్లు భయం కూడా ఉండేది. మా తమ్ముడు మస్తాన్‌బాబు చిన్నప్పటి నుంచి పర్వతారోహణలకి వెళతానంటే.. ఓ మామూలు అక్కలాగే నేనూ భయపడేదాన్ని. వారించేదాన్ని. వింంటేకదా! ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలను ముద్దాడాలని కలలుగన్నాడు. అన్నీ సాధించాడు. వాటిపైకి వెళ్లి వచ్చిన ప్రతిసారీ తన అనుభవాలను నాతో పంచుకొనేవాడు. శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగుర వేసిన క్షణాన కలిగే ఆనందానుభూతులను అభివర్ణించేవాడు. ఒక్కోసారి ఆ అనుభూతిని మాటల్లో చెబుతుంటే నేనూ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయేదాన్ని. కానీ అతను వెళ్లిన ప్రతిసారీ తిరిగి వచ్చేవరకు ప్రాణాలు ఉగ్గబట్టుకొని ఎదురుచూసేవాళ్లం.. ఇలా 37 సార్లు ప్రపంచంలోని పర్వతాలను అధిరోహించాడు. ప్రపంచంలో ఎత్తైన ఏడు పర్వతాలను తక్కువ సమయంలో అధిరోహించి అరుదైన రికార్డు నెలకొల్పాడని సంబరాలు చేసుకున్నాం! ప్చ్‌.. ఆ ఆనందం ఎక్కువకాలం నిలవలేదు. గత ఏప్రిల్‌లో ఆండీస్‌ పర్వతం ఎక్కుతూ చనిపోయాడనే.. వార్త మమ్మల్ని నిలువునా కూల్చేసింది. అమ్మ అయితే....ఇంకా కోలుకోనేలేదు..!
అదే అతని కోరిక.. ఏప్రిల్‌లో తమ్ముడు చనిపోయినప్పుడు మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు అర్జెంటీనా వెళ్లాను. తాకితే తమ్ముడి చేయి చల్లగా తగిలింది. మావాడు పర్వతారోహణకు ఎప్పుడు వెళ్లినా జాతీయ జెండా వెంట ఉండేది. ఆ రోజు లేదు. మార్గమధ్యంలోనే చనిపోయాడు కాబట్టి.. అదెక్కడో పడిపోయి ఉంటుంది. అంటే.. ఆండీస్‌పై జాతీయజెండాని ఎగరవేయాలన్న అతని ఆశయం నెరవేరలేదన్నమాట!! అప్పుడే ఆ క్షణానే అదే పర్వతంపై తిరిగి జాతీయ జెండాను ఎగరేయాలని నిర్ణయించుకున్నా! ఓ రకంగా ఈ వయసులో నాకు ఆ నిర్ణయం ఓ పెద్ద సాహసమే!! మరో రకంగా ఆత్మహత్యాసదృశ్యమే. కానీ చావుకి భయపడితే తమ్ముడి కోరిక నెరవేరదని అనుకున్నాను. అందుకే, ఆండీస్‌ ఎక్కేందుకు సిద్ధమయ్యాను.
ఎవరెస్ట్‌ అనుభవం.. మా తమ్ముడు పర్వతారోహణకు వెళ్లొచ్చిన ప్రతిసారీ అక్కడి అనుభవాలూ, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అదేపనిగా చెప్పేవాడు!! అలా వినీవినీ నాకూ పర్వతాలు ఎక్కాలనిపించింది. అది ఇప్పటి విషయం కాదులెండి. 2008లో. అతనితో కలిసి ఏకంగా ఎవరెస్టు ఎక్కడానికి సిద్ధమయ్యా. నావల్ల కాక.. మధ్యలోనే వచ్చేశాను. కానీ ఆండీస్‌ని అలా వదిలేయకూడదనుకున్నా. కనీసం నా తమ్ముడు ప్రాణాలొదిలిన ప్రాంతమైనా చూడాలనుకున్నా!! ముందు మానసికంగా సిద్ధమై... శిక్షణ తీసుకోవాలనుకున్నాను. కానీ ఇదంతా రహస్యంగా..! అమ్మకి కూడా చెప్పకుండా. నా కొడుకు శామ్యూల్‌ నుంచి కూడా దాచేశాను. జనవరి మొదటివారంలో అకస్మాత్తుగా బయల్దేరాను. చెన్నై విమానాశ్రయానికి వెళ్లాక.. అమ్మకీ, మావాడికీ ఫోన్‌ చేసి చెప్పాను. అమ్మ భోరుమంది. ‘తమ్ముడి పోయిన బాధనుంచి నేనింకా కోలుకోనేలేదు... మళ్లీ నువ్వూనా..!’ అంటూ గగ్గోలు పెట్టింది. నేను వినలేదు.
జెండా తీసుకున్నా.. ఆండీస్‌ పర్వతాలు దక్షిణ అమెరికా ఖండంలో.. అర్జెంటీనా, చిలీ దేశాల మధ్యలో ఉంటాయి. జనవరి 10న అర్జెంటీనాకి వెళ్లాను. అక్కడ మా తమ్ముడి ఆండీస్‌ యాత్రకు సహకరించిన హెర్నర్‌ అగస్టో సాయం తీసుకున్నాను. ‘నేను ఈ ప్రయాణంలో చనిపోతే దయచేసి నా దేహాన్ని భారత్‌కి తీసుకెళ్లొద్దు. నా తమ్ముడు చనిపోయిన చోటే ఉంచండి..’ అని రాసి మా టీమ్‌ లీడర్‌కి ఇచ్చాను. దారిలో ఫియాంబియా మ్యూజియం ఉంది. అక్కడే మా తమ్ముడు ఇక్కడి నుంచి తీసుకెళ్లిన జాతీయజెండా, టెంటూ వంటివి పరికరాలని భద్రపరిచి ఉన్నారు. ఆ దుప్పటిని చేతుల్లోకి తీసుకునేప్పుడు ఉద్వేగం ఆపుకోలేకపోయాను. ఎంతైనా.. నా తమ్ముడు కప్పుకున్నది కదా!! వాటితో నా ప్రయాణం మొదలుపెట్టాను. 19న బేస్‌ క్యాంప్‌ నుంచి ప్రయాణం.. ప్రయాసే తప్పలేదు. ఆ తర్వాత 27న ఆరువేల మీటర్ల ఎత్తయిన ట్రెస్‌క్రూసెస్‌ శిఖరాన్ని చేరుకున్నాం..! ఆ తర్వాత ఆండీస్‌ చేరుకుని జాతీయ పతాకం ఎగరేశాను. జనగణమన పాడుతూ జెండా వందనం చేస్తుంటే కన్నీరాగలేదు నాకు!! చిరునవ్వుతో భారత్‌ తిరగొచ్చాను. అన్నట్టు.. మా తమ్ముడు చనిపోయిన చోటు చూశాను. చాలా భద్రంగా నా తమ్ముడి వస్తువులన్నీ అక్కడ పేర్చి.. ఓ చిన్నపాటి స్మృతికేంద్రంలా చేశాను. అక్కడే భారత్‌ నుంచి చాలా భద్రంగా తీసుకెళ్లిన రాఖీ ఉంచాను..!
- పావులూరి శేషారావు, ఈనాడు, నెల్లూరు



నాకు నా దుప్పటి చాలు
 
దిల్లీ: ఆయన జాట్‌ కులస్థుడు. కానీ రిజర్వేషన్‌ రాజకీయాలకు ఆయన మదిలో చోటులేదు. ఆయన దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చదివాడు. అయితే అక్కడి ‘ఆజాదీ’ప్రసంగాలు, దేశద్రోహ ఆరోపణలను ఆయన ఖాతరు చేయలేదు. అతడు.. శనివారం కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమరుడైన సైనికాధికారి కెప్టెన్‌ పవన్‌ కుమార్‌. తన చివరి ఫేస్‌బుక్‌ పోస్టులో.. దేశంలో జరుగుతున్న తాజా పరిణామాలపై తనదైన శైలిలో ఆయన స్పందించారు. ‘‘కొందరికి రిజర్వేషన్లు కావాలి. కొందరికి స్వాతంత్య్రం కావాలి. నాకు మాత్రం నా దుప్పటి చాలు’’ అని పేర్కొన్నారు. ఒక సైనికుడి ఆలోచనతీరుకు, దేశభక్తికి ఈ మూడు వాక్యాలు నిదర్శనాలు.

కామెంట్‌లు లేవు: