‘మదనార్తి తీవ్రతకు మందేమిటయ్యా?’ అని అడిగితే, ‘ఏముందీ! ఆలింగనం మందున్నూ... అధరచుంబనం అనుపానమున్ను...’ అన్నాడొక వైద్య శిఖామణి. ఆ కోణంలోనే ‘వెలిగించవే చిన్ని వలపు దీపం’ అంటూ అభ్యర్థించేది పాతతరం నింపాదిగా! ఇప్పటి యువతరానికి అంతటి ఓపిక లేదు. ‘వేసవికాలం గాలుల్లాగ కొంచెంకొంచెం వీస్తావే... తరిమే తుంటరి తుపానులాగా చుట్టెయ్యొచ్చుగా!’ అంటూ తొందరపడుతోంది. మదనుడి ప్రతాపం మనుషులకే పరిమితం కాదంటాయి పురాణాలు. బ్రహ్మదేవుడంతటి వాడు సరస్వతిని చేపట్టడం మదనుడి ప్రమేయంతోనే- అంది మత్స్య పురాణం. పార్వతీదేవికి పరమేశ్వరుడితో మనువు కుదిర్చే క్రమంలో దేవతలు ఆశ్రయించింది మన్మథుణ్నే! శృంగార రసనాథుడు శ్రీనాథుడు ‘దక్షారామ చాళుక్య భీమవర గంధర్వ అప్సరో భామినులను’ లాలించడంలో అసలు కారణం మన్మథుడి తరుము కూతే! ‘భువనైక మోహనోద్ధత సుకుమార వార వనితా జనతా ఘన తాప హారి సంతత మధురాధరోదిత సుధారస ధారలు గ్రోలుట’ పట్ల ధూర్జటి మహాకవి మక్కువ చూపడానికి కారణమూ నిస్సందేహంగా కాముడే! తన తపస్సు చెడగొట్టడానికై వచ్చిన రంభను చూసి మనసు వికలమైన మణికంధరుణ్ని పింగళి సూరన వర్ణిస్తూ ‘మన్మథ వికారము, ధైర్యము క్రుమ్ములాడగన్’- కృష్ణ కృష్ణ అంటూ కళ్లు గట్టిగా మూసుకున్నాడన్నాడు. కనుక ఎంతటి వారినైనా కాముడు ఆవహిస్తే కలవరం తప్పదన్నది కవుల తీర్మానం. ‘ఎంతవారలైన కాంతదాసులే’ అని వాగ్గేయకారులు ఘోషించినా, ‘బ్రహ్మకైన పుట్టు రిమ్మతెగులు’ అని కవులు నిట్టూర్చినా- మదనుడి ప్రతాపానికి జయకేతనాలనే అనుకోవాలి.
మదన కుతూహలాన్ని కదన కుతూహలం వైపు ప్రోత్సహించే రోజిది. మన ప్రాచీనులు గుట్టుగా ‘కాముని పున్నమి’ అన్నదాన్నే ఆధునికులు ఆర్భాటంగా ‘ప్రేమికుల రోజు’గా బట్టబయలు చేశారనిపిస్తోంది. ఇది మన పద్ధతి కాదంటారు సంప్రదాయవాదులు. బెట్టు లేకుంటే గుట్టు లేదంటారు. ‘పలుకరించినను- పలుకక, బలిమిని అలుముకొనిన- చిక్కక, ప్రతికూలతను నటించు అంబుజానన విభునకు అత్యంత కామ దోహద సుఖంబె చేయు’ అని వీరభద్ర కవి ‘వాసవదత్తా పరిణయం’లో చెప్పిన గుంభన సూత్రమే మనవాళ్ళందరికీ ఆమోదయోగ్యం! ఆడపిల్లలకు సహజంగా సిగ్గెక్కువ. సిగ్గు అనే సంకెలలో బందీలై కాలు ముందుకు కదలని యువతుల్ని- మన్మథుడు వలపు అనే మూడు పేటల తాడుతో ముందుకు లాగుతాడన్నాడు- వారణాసి వేంకటకవి! ‘చెలువ లజ్జాభరంబను శృంఖలంబు తవులు కొనియుంట- పదము కదల్పదయ్యె, మేటి వలపు అను ముప్పిరి త్రాటబట్టి ముంగిలికి లాగదొడగె- అనంగుడంత!’ అంటూ అడుగిడు, అడుగిడక తడబడు జడిమల తడబాటును ‘రామచంద్రోపాఖ్యానం’లో చెప్పాడు. క్రమంగా కాలం మారింది. తడబాటు స్థానంలో తపనలు, తెగింపులు ముదిరాయి. ప్రేమికుల రోజున మదన కదన ప్రదర్శనలు బాహాటంగా విస్తరిస్తూనే ఉన్నాయి. సిగ్గు సంకెలలో చిక్కిన యువతులు సైతం ‘కేళికా వాసమునకు ఏగెదమటంచు ముందరికి రెండు మూడు అంజలు అంది నడుచుచున్నారు’ అని శకుంతలా పరిణయ కర్త చెప్పింది అక్షరాలా నిజమవుతోంది. ‘సరసన ఇచ్చాక జాగా... సరసానికి ఇంతటి జాగా’ అని గోముగా ప్రశ్నించేపాటి చొరవ సైతం అక్కడక్కడ కనిపిస్తోంది. దీన్ని కాల ప్రభావం అనుకోవాలేమో!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి