అధికార లాంఛనాలతో హనుమంతప్ప అంత్యక్రియలు
వేలాదిగా తరలివచ్చిన ప్రజానీకం
హుబ్బళ్లి - న్యూస్‌టుడే
దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో హనుమంతప్ప కొప్పద్ భౌతిక కాయాన్ని హుబ్బళ్లికి తీసుకొచ్చారు. విమానాశ్రయంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భౌతిక కాయాన్ని స్వీకరించారు. రాత్రి కర్ణాటక వైద్య విజ్ఞాన సంస్థ (కిమ్స్) వైద్యాలయం శవాగారంలో ఉంచారు. శుక్రవారం ఉదయం ఏడు గంటలకు వైద్యాలయం నుంచి నెహ్రూ క్రీడాప్రాంగణం వరకు వూరేగింపుగా తీసుకొచ్చారు. అమర యోధుడిని చివరిసారిగా చూసేందుకు తండోపతండాలుగా జనం తరలివచ్చారు. నగరంలోని వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో స్టేడియం చేరుకున్నారు. ఒక దశలో వారిని అదుపుచేయడం పోలీసులకు కష్టమైంది. శ్రద్ధాంజలి ఘటించేందుకు వచ్చిన ప్రజలకు నగర హోటళ్ల యాజమాన్య సంఘం నీటిని అందించింది. అమరవీరుడికి నివాళిగా జలసేవ చేసినట్లు ప్రతినిధులు తెలిపారు. దాదాపు మూడు గంటల పాటు ప్రజల దర్శనానికి అవకాశం కల్పించిన అనంతరం అంబులెన్స్‌లో 27 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామం బెటదూరుకు తరలించారు. మార్గమధ్యంలో రహదారికి ఇరువైపులా ఆయా గ్రామాల ప్రజలు బారులుతీరి వీర జవాన్‌ను చివరి సారిగా సందర్శించారు.
దేశ సేవకు వెనుకాడం
కొడుకు మృతి చెందడం తీవ్ర శోకాన్ని మిగిల్చినా దేశ సేవకు వెనుకాడబోమని హనుమంతప్ప తల్లి, సోదరులు ప్రకటించారు. యువత దేశ రక్షణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి