About this blog

I feel this blog as a reflection of my thoughts to myself , and sometimes as a public diary, and the is my only friend to share my thoughts who says never a "oh no! ,you shouldn't....That is boring...."

sometimes some decisions are far far better than a suicide

yes, I am gonna take the bold step. Time can only heal my grief.

డబ్బుకోసమే చదువా ? eenadu article

నాన్నా కంగ్రాట్స్‌... 
నేను ఓడిపోయాను!
ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించి...పేరున్న క్యాంపస్‌లో సీటు తెచ్చుకున్న ఓ ‘టాపర్‌’ తన తండ్రికి రాసిన ఉత్తరం ఇది. ‘బొమ్మరిల్లు’ సినిమాలో నాన్న క్లైమాక్స్‌లో మారిపోతాడు. కథ సుఖాంతం అవుతుంది. కానీ, జీవితం సినిమా కాదే! మంచి మార్పు అనేది, ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. పిల్లల ఆశయాలకు తగినట్టు కన్నవారి ఆలోచనలూ మారాలన్న ఓ బిడ్డ ఆకాంక్ష అక్షరాల్లో...
 
నాన్నా...
ఈ ఉత్తరం ఇన్‌బాక్స్‌లో పడే సమయానికి మీరు బాల్కనీలో నిలబడి ‘మా అబ్బాయికి ఇంజినీరింగ్‌లో సీటొచ్చింది. మంచి కాలేజీ. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ గ్యారెంటీ. ఆతర్వాత ఎమ్మెస్‌ చేయిద్దామని అనుకుంటున్నా’ అని ఎవరితోనో ఫోన్లో కబుర్లు చెబుతూ ఉంటారు. లేదంటే, పక్కింటి బాబాయిగారిని కాఫీకి పిలిచి మరీ, నన్నెంత క్రమశిక్షణగా పెంచారో, నన్ను ‘ఐఐటీ ఓరియెంటేషన్‌’ ఉన్న స్కూళ్లలో చదివించడం కోసం ఎన్ని ట్రాన్స్‌ఫర్లు రద్దు చేయించుకున్నారో, ఎన్ని ప్రమోషన్లు వదులుకున్నారో కథలు కథలుగా వర్ణిస్తుంటారు.
కంగ్రాట్స్‌ నాన్నా!
మీరు గెలిచారు.
మీ కలలు నిజం అయ్యాయి. మీరు తలెత్తుకోగలిగే ర్యాంకు తెచ్చుకున్నా. మీకు ఇష్టమైన క్యాంపస్‌లో సీటు సాధించా. మీరు గర్వంగా చెప్పుకునే ప్యాకేజీతోనే ప్లేస్‌మెంట్‌ కూడా వచ్చేస్తుంది.
నేనే...
ఓడిపోయాను.
ఘోరంగా ఓడిపోయాను.
అంతా పుస్తకాల సంచీ భుజానికేసుకుని కాలేజీకి బయల్దేరే వయసులో, నేను బ్యాక్‌ప్యాక్‌లో ల్యాప్‌టాప్‌తో ఆఫీసుకెళ్లాలనుకున్నా. అంతా క్లాస్‌రూమ్‌లో పాఠాలు వినే సమయంలో నేను బోర్డ్‌రూమ్‌లో ఇన్వెస్టర్లకి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వాలనుకున్నా. అంతా అమ్మానాన్నల దగ్గర పాకెట్‌ మనీ తీసుకునే రోజు, నేను ఉద్యోగుల జీతాల చెక్కు మీద సంతకం పెట్టాలనుకున్నా. ఆ ఆశలన్నీ చచ్చిపోయాయి. మీవల్లే, అంతా మీవల్లే! ఇంకో నాలుగేళ్లు...మళ్లీ పాఠాలూ, మళ్లీ ప్రాజెక్టులూ, మళ్లీ పరీక్షలూ, మళ్లీ మార్కులూ! ఇప్పటికైనా అర్థమైందా మీరు చేసిన పొరపాటేమిటో. మీ కలల్ని నిజం చేసుకోడానికి, నా కలల్ని చిదిమేశారు. మీరు కోల్పోయింది సాధించడానికి, నేను పొందాల్సింది లాక్కున్నారు.
ఇంజినీరు అనిపించుకోవాలన్నది మీ చిన్నప్పటి కోరిక. స్తోమతలేక, రాజీపడి బీకామ్‌లో చేరారు. చార్టర్డ్‌ అకౌంటెంట్‌ అయినా కావాలనుకున్నారు. అదీ కుదర్లేదు. ఇంకోసారి రాజీపడిపోయి గుమస్తాగా స్థిరపడ్డారు. ఆ వెలితి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది. ఆ లోటును నా ద్వారా పూడ్చుకోవాలనుకున్నారు. నేను భూమ్మీద పడిన మరుక్షణమే ‘ఆపరేషన్‌ ఇంజినీరింగ్‌’ మొదలైంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా, జోతిష్కుడి దగ్గరికెళ్లి రాశిచక్రం గీయించారు. ‘బిడ్డ మహర్జాతకుడు. చూస్తూ ఉండండి, చాలా గొప్పవాడు అవుతాడు’ అని చెప్పగానే, ‘ఇంకేముంది, ఇంజినీరే!’ అన్న నిర్ణయానికొచ్చారు. నామకరణోత్సవం రోజు పురోహితుడు వెండి పళ్లెంలో బియ్యం పోసి...అందులో నా పేరు రాయమంటే, పేరే కాదు...పేరు పక్కన ‘బీటెక్‌’ అని కూడా రాశారు. నా వయసు పిల్లలు ముద్దుముద్దుగా మాటలు నేర్చుకుంటున్న సమయానికే, నాతో ఎక్కాలన్నీ బట్టీపట్టించారు. ‘పసివాడికి అప్పుడే చదువులేమిటి?’ అని అమ్మో, నానమ్మో వారించబోతే ‘ఇంజినీరింగ్‌కు లెక్కలే పునాది’ అని మీ హింసను సమర్థించుకున్నారు. ఒకటో తరగతి నుంచే ఐఐటీకి కోచింగ్‌ ఇచ్చే స్కూళ్లు కనుక ఉంటే, అక్కడే చేర్పించేవాళ్లేమో. అదృష్టం, ఆ ఆలోచన ఏ కార్పొరేట్‌ వాళ్లకూ రాలేదు. ఐదో తరగతి దాకా మమ్మల్ని వూపిరి పీల్చుకోనిస్తున్నారు. ఆతర్వాత నుంచీ నన్ను ఇంజినీరింగ్‌ ఫ్యాక్టరీలో ముడిసరుకును చేసేశారు. లేకపోతే, హైస్కూలులోనే కాలేజీ స్థాయి లెక్కలేమిటి నాన్నా! ఇంటికొచ్చినవాళ్లకంతా ఆ పెద్దపెద్ద పుస్తకాలు చూపించి మీరు మురిసిపోవడమూ! ఇంటర్మీడియట్‌ అయితే ఓ బందిఖానా! గాలీ వెలుతురూ లేని చీకటి గదుల్లో రాత్రీపగలూ అదేపనిగా తోమేసేవారు. మా ‘ర్యాంకర్స్‌ బ్యాచ్‌’ పరిస్థితి అయితే మరీ ఘోరం. అమ్మానాన్నలతో మాట్లాడితే మనసు ‘డైవర్ట్‌’ అవుతుందట! ‘స్కోరు’ తగ్గుతుందట! కనీసం ఫోన్లో కూడా మాట్లాడనిచ్చేవాళ్లు కాదు. రోజూ టెస్టులే. గుర్తుందా! వరుసగా రెండు పరీక్షల్లో తక్కువ మార్కులొచ్చాయని...క్లాసులోనే, అందరిముందూ తిట్టేసివెళ్లారు మీరు. ఎంత బాధనిపించిందో తెలుసా! ఏడుపు తన్నుకొచ్చింది. ఏడ్చినా మీరు అర్థం చేసుకుంటారన్న నమ్మకం లేదు. నోరెత్తకుండా సర్దుకుపోయాను. మీకు కావాల్సిందేదో మీకు ఇచ్చేద్దామని కసికొద్దీ చదివాను. మంచి ర్యాంకు తెచ్చుకున్నాను. సగం బాధ్యత తీరిపోయింది. నాలుగేళ్ల తర్వాత, ఆ డిగ్రీ కాగితాలేవో మీకు అప్పగిస్తే మిగతా బాధ్యతా పూర్తయిపోతుంది. కనీసం, ఆతర్వాతైనా నన్ను నన్నుగా బతకనివ్వండి. నాకు ఇష్టమైన పనేదో చేసుకోనివ్వండి.
ఏ తల్లిదండ్రులైనా, పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకోవడంలో తప్పులేదు. అందరికంటే ముందుండాలని తపించడంలోనూ తప్పులేదు. బిడ్డ వృద్ధిలోకి రావాలని ఆశించడం కూడా నేరమో ఘోరమో కాదు. నన్నూ స్తోమతకు మించే చదివించారు. పెద్దపెద్ద కోచింగ్‌ సెంటర్లలో చేర్పించారు. కానీ, చదివితే గిదివితే ఇంజినీరింగే చదవాలన్న మొండిపట్టుదల ఎందుకు నాన్నా? మీలాంటి వాళ్ల దృష్టిలో మనుషులు రెండే రకాలు...ఇంజినీర్లూ నాన్‌ ఇంజినీర్లూ! ఇంజినీరింగ్‌ చదవని పిల్లలు ఎందుకూ కొరగానట్టూ, వాళ్లకసలు తెలివితేటలే లేనట్టూ, ప్రపంచాన్ని ఏలే గొప్ప అవకాశాన్ని కోల్పోయినట్టూ... తెగ బాధపడిపోతారు మీరంతా. వూరికో పుట్టగొడుగు ఇంజినీరింగ్‌ కాలేజీ వెలిసింది కూడా మీ పుణ్యానే! అసలు అది... కాలేజీనా బందెలదొడ్డా అన్నది పట్టించుకోరు. పాఠాలు చెబుతున్నది లెక్చరర్లా, అటెండర్లా అన్నదీ మీకు అవసరం లేదు. అసలు పాఠాలు చెప్పకపోయినా ఫర్వాలేదు. తీసుకెళ్లి చేర్పించేస్తారు. బిడ్డ ‘ఇంజినీర్‌’ అయితే చాలు.
నా వూహ నిజమైతే హైదరాబాద్‌, బెంగళూరు లాంటి చోట్ల... గాల్లో రాయి విసిరితే...అది నేరుగా వెళ్లి ఏ ఇంజినీరుకో తగులుతుంది, లేదంటే ఏ వీధి కుక్కనో తాకుతుంది. అంతగా విస్తరించిపోయింది మా సంతతి. నాకు తెలుసు, నేనిలా మాట్లాడితే మీకు కోపం వచ్చేస్తుంది. పిచ్చిపిచ్చి ఆలోచనలన్నీ వదిలేసి, బుద్ధిగా చదువుకోమంటారు? చదువులో ఆలోచన కూడా ఓ భాగమే నాన్నా! చిన్నప్పట్నుంచీ నాకెన్ని ఆలోచనలు ఉండేవో! ఇంటర్‌ పూర్తికాగానే... టీషర్ట్స్‌ మీద ఇంజినీరింగ్‌ క్యాప్షన్లూ క్యారికేచర్లూ ముద్రించి అమ్మాలనుకున్నా. ప్రతి క్యాంపస్‌లోనూ ఓ స్టాల్‌ పెడదామనుకున్నా. మీరు పడనిస్తేగా! ‘పిచ్చిపిచ్చి కబుర్లొద్దు. బుద్ధిగా ఇంజినీరింగ్‌లో చేరు. వ్యాపారం అంటే మాటలనుకున్నావా’- అని నా ఉత్సాహం మీద నీళ్లు చల్లేశారు. ఇంకేముంది, నా బిజినెస్‌ ప్లాన్‌ను ముక్కలు ముక్కలుగా చించేసి చెత్తబుట్టలో పడేశా. నిన్నో మొన్నో న్యూస్‌పేపర్లో చదివా. అచ్చంగా ఇలాంటి ఆలోచనతోనే ఓ స్టార్టప్‌ వచ్చింది. అందులో ఓ వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ ఐదు కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఎవరికి తెలుసు, ఫైనల్‌ ఇయర్లో...ప్లేస్‌మెంట్‌ కోసం నేను ఆ కంపెనీకే వెళ్లాల్సి రావచ్చు, అచ్చంగా నాలా ఆలోచించే వ్యక్తి ముందే చేతులు కట్టుకుని నిలబడాల్సి రావచ్చు. గూగుల్‌ సృష్టికర్త నాన్న కూడా మీలానే నిరుత్సాహపరచి ఉంటే, ఫేస్‌బుక్‌ ఆవిష్కర్త తండ్రి కూడా మీలానే మందలించి ఉంటే...లారీపేజ్‌లూ జుకెర్‌బర్గ్‌లూ మామూలు ఇంజినీరింగ్‌ గుమస్తాలుగా మిగిలిపోయేవాళ్లు.
‘మీ పిల్లలు ఎలా ఉండాలని మీరు ఆశిస్తున్నారు?’ అని తల్లిదండ్రుల్ని అడిగితే...కెనడాలో డెబ్భైఎనిమిది శాతం మందీ, యూకేలో డెబ్భై ఏడుశాతం మందీ ‘ఆనందంగా..’ అని జవాబిచ్చారు. ‘కెరీర్‌లో విజయం సాధించాలి’ అన్న సమాధానం మాత్రం మన తల్లిదండ్రుల నుంచే బలంగా వినిపించింది. ఇవన్నీ నా అంచనాలు కాదు. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ అధ్యయనాలు. మీరు సంపాదనలోనే ఆనందాన్ని చూస్తున్నారు. అలా కాదు నాన్నా! సంపాదన వేరు, ఆనందం వేరు. సంపాదనే ఆనందం అయితే, లక్షల జీతాలు అందుకునే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు చెప్పండి! ఒక్క బెంగళూరులోనే నూటికి ఇరవైమంది ఐటీ ఉద్యోగులకు మానసిక సమస్యలున్నాయని ఎక్కడో చదివాను. వృత్తీ, ప్రవృత్తీ వేరుగా ఉన్నప్పుడే ఇలాంటి ఇబ్బందులొస్తాయి. మనకు నచ్చినపని చేయడంలో ఆనందం ఉంది. మనకు ఇష్టమైన వ్యాపకంలో నిమగ్నం కావడంలో సంతృప్తి ఉంది. అది ఇంజినీరింగ్‌ పని అయినా కావచ్చు. కానీ, ఇంజినీరింగే కావాలనుకోవడం మూర్ఖత్వం.
మీకో విషయం తెలుసా? ఒలింపిక్స్‌ ప్రారంభం నుంచీ ఇప్పటిదాకా మనం ఇరవై ఆరు పతకాలు సాధించాం. చైనా ఒక్క 2012 ఒలింపిక్స్‌లోనే ఎనభై ఎనిమిది పతకాల్ని ఖాతాలో వేసుకుంది. ఎందుకింత తేడా? కారణం చెప్పమంటారా? ‘డాడీ! నాకు ఆటలంటే ప్రాణం’ అని ఏ పసివాడైనా చెబితే చైనీస్‌ నాన్నలు బుగ్గన ఓ ముద్దిచ్చి...ఏ స్పోర్ట్స్‌ స్కూల్లోనో చేర్పిస్తారు. అదే మీరైతే చెంప వాయగొట్టి బడికి తోలేస్తారు. నూట పాతిక కోట్ల పైచిలుకు జనాభా కలిగిన దేశంగా మనం సాధించిన నోబెల్‌ బహుమతుల్ని వేళ్లమీద లెక్కబెట్టొచ్చు. మనలో మూడోవంతు కూడా లేని అమెరికా రెండొందల పురస్కారాలు మెడలో వేసుకుంది. చైనా, అమెరికా కలసి ఏటా ఎంతమంది ఇంజినీర్లను తయారు చేస్తున్నాయో అంతకంటే ఎక్కువమందే మన క్యాంపస్‌ కార్ఖానాల్లో ఉత్పత్తి అవుతున్నారు. కానీ ఏం లాభం? అందులో పద్దెనిమిదిశాతం మంది దగ్గర మాత్రమే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యం ఉంటోంది. మిగిలినవాళ్లంతా....నిరుద్యోగులుగానో, చిరుద్యోగులుగానో మిగిలిపోతున్నారు. ‘ముందు నువ్వు ఇంజినీరింగ్‌ పూర్తిచేసిరా, ఆతర్వాత ఆలోచిద్దాం’ అంటూ బలవంతంగా పిల్లల్ని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో చేర్పించే తల్లిదండ్రులు మరొక్కసారి ఆలోచిస్తే బావుంటుంది. నలభై ఏళ్ల కెరీర్‌లో నాలుగేళ్ల కాలం తక్కువేం కాదు. ఆ సమయాన్ని ఇష్టమైన చదువులకు కేటాయిస్తే, అద్భుతాలు జరుగుతాయి. ఏ ఐఏఎస్‌ ఆఫీసరో ఐపీఎస్‌ ఆఫీసరో కావచ్చు, చార్టర్డ్‌ అకౌంటెన్సీ కోర్సు చేయవచ్చు. ఫైన్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ అందుకోవచ్చు. సినిమా, యాడ్స్‌, మల్టీమీడియా.. ఇంకేదైనా రంగం మీద పట్టు సాధించవచ్చు. పట్టా కోసమే చదివే చదువు...అసలు చదువే కాదు! ఆ కాగితం నాలుక గీసుకోడానిక్కూడా పనికిరాదు.
నాన్నా, ఓసారి గుర్తుచేసుకోండి. మ్యాప్‌ మీద నా చిట్టిచిట్టి వేళ్లను ముందుకు జరుపుతూ యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా దగ్గర ఆగిపోగానే...ఎంత మురిసిపోయేవారో? పెద్దయ్యాక నువ్వు ఉండబోయేది అక్కడేరా? అని సంబరంగా చెప్పేవారు కదూ! ఇప్పుడు నేనూ మీకో పరీక్ష పెడుతున్నా. నా పుస్తకాల అరలో అట్లాస్‌ ఉంటుంది. ఓసారి తీసుకోండి. మాల్టా...అనే దేశం ఎక్కడుందో ఓసారి చూడండి. గుర్తించడం కష్టం కదూ! నిజమే, ఏ ప్రత్యేకతా లేని అతి చిన్న దేశమిది. జనాభా ఐదారు లక్షల లోపే ఉంటుంది. మన దేశంలో ఏటా పదిహేను లక్షలమంది ఇంజినీర్లు తయారవుతున్నారు. అంటే, అందులో మూడోవంతు మనుషులు కూడా మాల్టాలో ఉండరు. కానీ....గ్లోబల్‌ ఇన్నొవేషన్‌ ఇండెక్స్‌లో భారత్‌ (81) కంటే మాల్టానే (26) చాలా ముందుంది. ఆవిష్కరణ స్వేచ్ఛలోంచి పుడుతుంది. అది... ఇష్టమైన చదువులు చదివే స్వేచ్ఛ, ఇష్టమైన ఆలోచనలు చేసే స్వేచ్ఛ, ఇష్టమైన ప్రయోగాలు చేసే స్వేచ్ఛ! అవేవీలేని చోట...ఆవిష్కరణలు ఉండవు, అన్నీ అనుకరణలే. ఆ నేలమీద సైంటిస్టులు పుట్టరు, మెకానిక్కులు తయారవుతారు. గూగుల్‌ పుట్టదు, మహా అయితే గూగుల్‌ ఉద్యోగులు పుడతారు.
రాత్రిపూట ఏ బైక్‌ మీదో వీధుల్లో వేగంగా వెళ్తుంటే కుక్కలు వెంటపడుతుంటాయి. ఎంతదూరమైనా వచ్చి బండిని అందుకోవాలని ఆరాటపడుతుంటాయి. పరుగెత్తి పరుగెత్తి బైక్‌ దాకా వచ్చాయే అనుకోండి. ఏమిటి ఉపయోగం! ఏం సాధించినట్టు? కాసేపు మొరిగేసి, మెల్లగా తోక ముడుచుకుని వెళ్లిపోతాయి. మా పరిస్థితీ అలానే ఉంటోంది. ఇంటర్లో ఎంపీసీలో చేరాలి. చేరతాం. ఇంజినీరింగ్‌లో సీటు తెచ్చుకోవాలి. తెచ్చుకుంటాం. తర్వాత? క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌. ఆతర్వాతేంటి? ఏమో?? బతుకంతా లక్ష్యం తెలియని పరుగే.
మీరు పంపిన బడికే వెళ్లాం, మీరు కొన్న బట్టలే వేసుకున్నాం, మీరు తీసుకెళ్లిన సినిమాలే చూశాం. ఇష్టమున్నా లేకపోయినా...ఇంతకాలం మీ మార్గంలోనే నడిచాం. కనీసం ఇప్పటి నుంచైనా మా దారిని మేం సిద్ధం చేసుకునే అవకాశం ఇవ్వండి. ‘నువ్వేం చదవాలనుకుంటున్నావ్‌?’ అన్న ప్రశ్నకి యూకేలో పదిహేనూ పదహారేళ్లలోపు పిల్లల్లో ఇరవైశాతం మందీ, అమెరికాలో ముప్ఫై శాతం మందీ మాత్రమే...‘ఇంజినీరింగ్‌’ అని జవాబిస్తారు. ఇక్కడ మాత్రం అది ఎనభైశాతానికి మించుతుంది. కారణం...గుర్రాలకు కట్టినట్టు మా కళ్లకూ గంతలు కట్టేశారు. మరోదారి తెలియకుండా చేశారు. తెలివైన విద్యార్థులంతా ఇంజినీరింగే చదువుతారన్న అభిప్రాయాన్ని సమాజం మీద రుద్దేశారు. ఆ కారణంగానే చరిత్ర, అర్థశాస్త్రం లాంటి చదువుల్ని చదివేవాళ్లే లేకుండా పోయారు. మా ఫ్రెండ్‌ పాండూగాడికి చరిత్ర అంటే ఎంత ఇష్టమంటే, ఏదో ఒకరోజు సింధూనాగరికత బయటపడిన ప్రాంతానికి వెళ్లి...ఆ లిపిని చదివేస్తానని అనేవాడు. ప్రస్తుతం...జావా ప్రోగ్రామింగ్‌ చదువుతున్నాడ్లెండి. రాజుగాడికి తెలుగు భాషంటే ప్రాణం. పదో తరగతిలోనే ఆటవెలదిలో పద్యాలు రాసేవాడు. ఇప్పుడు...ఉప్పూకారంలేని సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌లు రాసుకుంటున్నాడు పాపం. బలవంతంగానో, భయపెట్టో మీరు మహా అయితే లక్షలమంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు మాలాంటి మరొకర్ని జోడించగలరు. కానీ, సమాజం ఓ చరిత్రకారుడినీ, ఓ సాహితీవేత్తనూ కోల్పోతుంది. ఎవరికి తెలుసు అలాంటి విద్యార్థుల్లో....రేపటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఉండవచ్చు, నోబెల్‌ పురస్కార విజేతా ఉండవచ్చు. ఆ ప్రతిభనంతా నిర్దాక్షిణ్యంగా నలిపేసినట్టేగా!
నాన్నా! మీలాంటి మధ్యతరగతి వాళ్లకి... ఖరీదైన ప్రాంతంలో ఇల్లు ఓ స్టేటస్‌ సింబల్‌, ప్రతి మాటకి ముందూ మా బంజారాహిల్స్‌ ఫ్లాట్‌ అనో, మా డాబాగార్డెన్స్‌ డూప్లెక్స్‌ అనో జోడిస్తూ ఉంటారు. ఖరీదైన కారు ఓ స్టేటస్‌ సింబల్‌. నా ఎకోస్పోర్ట్‌ అనో, నా డస్టర్‌ అనో వూతపదంగా వాడేస్తుంటారు. ఆ మమకారం అక్కడితో ఆగిపోతే బావుండేది. మా చదువుల్నీ ఓ స్టేటస్‌ సింబల్‌గానే చూస్తారెందుకు? మా వాడు చదువుతున్న ఐఐటీ ముంబయ్‌ క్యాంపస్‌లో అలా జరిగిందనో, ఇలా జరిగిందనో గొప్పగా చెప్పుకోవాలనుకుంటారు. మాకు ఐఐటీల్లోనో, ఇంకెక్కడో సీటు రాలేదన్న బాధ కంటే, నలుగురికీ ఏం సమాధానం చెప్పాలా అన్న ఆందోళనే మీకెక్కువ. మీరే అంత ఒత్తిడికి గురైతే, పసివాళ్లం మా పరిస్థితి ఎలా ఉంటుందో వూహించుకోండి. కాబట్టే, ప్రతి తొంభైనిమిషాలకూ ఓ విద్యార్థి ఎక్కడో ఓ చోట ఆత్మహత్యకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. రోజుకు ఇరవైమంది పరీక్షల భయంతో ప్రాణాలు తీసుకుంటూనే ఉన్నారు. ఫెయిల్‌ అవుతామేమో అన్న భయం కంటే...తాము ఫెయిల్‌ అయితేనో, తక్కువ ర్యాంకు తెచ్చుకుంటేనో తల్లిదండ్రుల స్పందన ఎలా ఉంటుందో అన్న భయంతో చావాలనుకునేవారే చాలామంది. ‘ఇట్‌ ఈజ్‌ ఓకే టు ఫెయిల్‌ మై సన్‌’...అన్న భరోసా అమ్మో నాన్నో ఇవ్వగలిగితే ఎవరూ ఓటమికి భయపడరు, చావుకు సిద్ధపడరు.
అప్పటిదాకా...
మిమ్మల్ని గెలిపించడానికి...
మేం ఓడిపోతూనే ఉంటాం.

కోచింగ్‌ ఫ్యాక్టరీలు!
హానగరాల్లో ఎనభై ఏడుశాతం ప్రైమరీ స్కూలు విద్యార్థులూ, తొంభై అయిదు శాతం హైస్కూలు విద్యార్థులూ ట్యూషన్లనో కోచింగ్‌ సెంటర్లనో ఆశ్రయిస్తున్నట్టు అంచనా. ఇంజినీరింగ్‌ ఎంట్రెన్సులకు వచ్చేసరికి...అదో వేల కోట్ల రూపాయల వ్యాపారం. ‘ఫీజు వాపస్‌’, ‘సీటు గ్యారెంటీ’ ఆఫర్లూ ఉంటాయి. ఆ మధ్య హైదరాబాద్‌లో, ఓ నిపుణుడిని ఒకానొక శిక్షణ సంస్థ ఏడాదికి కోటి రూపాయల జీతానికి నియమించుకుంది. అంతలోనే మరో శిక్షణ సంస్థ ఇంకాస్త ఎక్కువిచ్చి తన్నుకెళ్లిపోయింది. ఆ వ్యవహారంలో కిడ్నాప్‌లూ గట్రా జరిగినట్టు వినికిడి. రాజస్థాన్‌లోని కోటాలాంటి చోట్లయితే కనీసం ఐదొందలమంది శిక్షకుల...(శిక్షించేవారు కాదు, శిక్షణ ఇచ్చేవారు) వార్షిక వేతనం యాభై లక్షల నుంచి కోటి రూపాయలదాకా ఉంటుందని అంచనా. కొందరికైతే యాజమాన్యాలు సెక్యూరిటీ గార్డుల్ని కూడా నియమిస్తున్నాయి. అక్కడి చదువుల ఒత్తిడి తట్టుకోలేక కీర్తి అనే విద్యార్థిని ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. ఆ బాలిక చివరి కోరిక ...‘కోటా కోచింగ్‌ ఫ్యాక్టరీల్ని మూసేయాలి’.

ఫిన్‌లాండ్‌ పాఠం
 చిన్న దేశం విద్యారంగంలో ఎంతో అభివృద్ధిని సాధించింది. మన దగ్గర రెండేళ్లు నిండగానే పిల్లల్ని నర్సరీకి తోలేస్తాం. కానీ అక్కడ ఏడేళ్లు నిండితే కానీ ప్రవేశానికి అవకాశం లభించదు. ఏడో తరగతికి వచ్చేదాకా ఏడాదిలో సగం రోజులు బడి, సగంరోజులు సెలవులు. పిల్లలకు అలసటగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోడానికి ప్రత్యేకంగా గదులు ఉంటాయి. పదమూడేళ్లు వచ్చేదాకా గ్రేడింగుల గొడవ ఉండదు. హోంవర్కులు అస్సలు ఇవ్వరు. ఆ దేశంలో ఉపాధ్యాయుల్ని చాలా గౌరవిస్తారు. ప్రతి ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు ఉపాధ్యాయుడు కావాలని కోరుకుంటారు. ప్రపంచంలో హాయిగా, ఆనందంగా బాల్యం గడిచిపోయే దేశాల జాబితా తయారు చేస్తే ఫిన్‌లాండ్‌ మొదటి స్థానంలో ఉంటుంది.


‘మహా’ పరీక్షలు
న దేశంలో పదో తరగతి పరీక్షలనేవి, పార్లమెంటు ఎన్నికలంత అతిపెద్ద ప్రక్రియ. బంధుమిత్రసపరివారంగా పిల్లాడి ఫలితాల కోసం ఎదురుచూస్తారు. అమ్మ ఉపవాసాలు చేస్తుంది. నాన్న ముడుపులు కట్టిపెడతాడు. బిడ్డకు మంచి మార్కులొచ్చాయా, అంతా దేవుడి దయే! రాలేదా...అదంతా వాడి స్వయంకృతమే! రోజుకు పన్నెండు గంటలకు మించి కష్టపడలేకపోయాడు మరి! ఇక, ఎంట్రెన్సులకే ఎంట్రెన్సు...అమ్మలగన్న అమ్మ లాంటిది ఐఐటీ జేయీయీ (జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌). ఈసారి పన్నెండు లక్షలమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇరవైవేలమందికే ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో కాలుపెట్టే అవకాశం! అంటే, సీటుకు ఆస్కారం రెండు శాతమే! ప్రపంచ ప్రసిద్ధమైన హార్వర్డ్‌ యూనివర్సిటీ కూడా దరఖాస్తుదారుల్లో 5.9శాతం మందికి సీట్లు ఇచ్చింది. అగ్రశ్రేణి విశ్వవిద్యాలయం స్టాన్‌ఫర్డ్‌ కూడా దాదాపు ఏడుశాతం మందికి అవకాశం ఇచ్చింది. మన పిల్లలు ప్రపంచంలోనే అత్యధిక పోటీ ఉన్న పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. లక్షలు పోసి కోచింగ్‌ సెంటర్లో చేర్పించాం కాబట్టి, సీటు కొట్టాల్సిన బాధ్యత వాళ్లదే అన్న భావన వద్దే వద్దు.

చాచాతోనే మొదలు...
చాచా నెహ్రూకు ఇంజినీరింగ్‌ చదువంటే మహా అభిమానం. ఐఐటీల ఏర్పాటు ఆయన చొరవతోనే జరిగింది. దేశానికి అవసరమైన ఆవిష్కరణలన్నీ ఆ ఆవరణలలోనే జరుగుతాయని ఆశించారు. కానీ, అమెరికా గల్ఫ్‌ దేశాల నుంచి చమురునూ ఫ్రాన్స్‌ నుంచి మద్యాన్నీ కొనుగోలు చేస్తున్నట్టు, భారత్‌ నుంచి ఐఐటీ పట్టభద్రుల్ని దిగుమతి చేసుకుంటుందని వూహించలేకపోయారు. అమెరికాలోని అంకుర సంస్థల్లో పదహారుశాతం వరకూ ఐఐటీ పట్టభద్రులవే. భారత సర్కారు ప్రతి ఐఐటీ విద్యార్థి మీదా పదిహేను లక్షల రూపాయల దాకా ఖర్చుపెడుతోందని అంచనా. అందరు తాతయ్యల్లానే జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా తన మనవడు రాజీవ్‌గాంధీ ఐఐటీలో చదవాలని ఆశించారు. కానీ, ఆ మార్కులకు చిట్టచివరి సీటు కూడా రాదని తేలిపోయింది. ఇందిరాగాంధీ అప్పటికే సదరు ఐఐటీ వ్యవస్థాపక డైరెక్టరుకు తన తండ్రి మనసులోని మాట చెప్పారు. ఆ ముక్కుసూటి పెద్దమనిషి నిబంధనలు అనుమతించవని సూటిగానే తేల్చేశారు. ఆ వ్యవహారాన్ని ఆయన తన ఆత్మకథలో ప్రస్తావించారు కూడా.


ఇంజినీరింగ్‌ యాత్రాస్పెషల్‌!
దిత్య అయ్యర్‌...అమ్మానాన్నల పోరు పడలేక ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. ఆతర్వాత, బెంగళూరులోని ఓ ఛాయ్‌ స్టార్టప్‌లో పనిచేశాడు. రోజూ బోలెడంతమంది ఇంజినీరింగ్‌ కుర్రాళ్ల కథలు వినేవాడు. వినగా వినగా, కొన్నాళ్లకి దేశంలోని ప్రధాన ఇంజినీరింగ్‌ సంతల్ని చూడాలన్న కోరిక కలిగింది, తన అనుభవాల్ని పుస్తకంగా రాయాలన్న ఆలోచనా వచ్చింది. రైలు ఛార్జీలూ, భోజనాల ఖర్చులూ, లాడ్జీల అద్దెలూ ఎవరిస్తారు? తన ఆలోచనని ఆన్‌లైన్‌లో పెట్టాడు - ‘క్రౌడ్‌ ఫండింగ్‌’ కోసం. మూడొందలమంది స్పందించారు. బాగానే వసూలైంది. ఆ డబ్బుతో...ముంబయి, కోటా, హైదరాబాద్‌ - ఇలా దాదాపు ఇరవై నగరాల్ని చుట్టొచ్చాడు. ఇంజినీరింగ్‌ ఎంట్రెన్సుల కోసం జైళ్లను తలపించే కోచింగ్‌ సెంటర్లలో బిక్కుబిక్కుమంటూ బతుకులీడుస్తున్న వందలమంది విద్యార్థులతో మాట్లాడాడు. నమూనా పరీక్షల్లో టాపర్లుగా నిలిచే విద్యార్థులకు లక్షల డబ్బు ఎరగా చూపి...తమ కోచింగ్‌ సెంటర్లకు లాక్కెళ్లిపోయే ఎత్తుగడల్నీ చూశాడు. తెలుగు గడ్డమీద అయితే...ఐఐటీ సీటుకూ రాబోయే కట్నాలకూ ముడిపెట్టే ‘డాలరు’ తెలివితేటలకు నోరెళ్లబెట్టాడు కూడా. వాటన్నిటినీ ‘ద గ్రేట్‌ ఇండియన్‌ అబ్సెషన్‌’లో ప్రస్తావించాడు.